
‘108’లో ప్రసవం
పుట్టపర్తి అర్బన్: పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆడశిశువుకు జన్మనిచ్చింది. వివరాలు... పుట్టపర్తి మండలం కర్ణాటక నాగేపల్లికి చెందిన సాకే వెంకటేష్ భార్య ముత్యాలమ్మకు శుక్రవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబసభ్యుల నుంచి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఈఎంటీ రామ్మోహన్, పైలెట్ శ్రీనివాసులు ఆగమేఘాలపై ఆ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే నొప్పులు భరించలేక ఇబ్బంది పడుతున్న ముత్యాలమ్మకు ధైర్యం చెప్పి అంబులెన్స్‌లో ఎక్కించుకుని ధర్మవరంలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో కొత్తచెరువు మండలం ఆమిద్యాలకుంట వద్దకు చేరుకోగానే నొప్పులు తీవ్రం గాయడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి ఆశ కార్యకర్త నాగమణి సహకారంతో 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని ఈ సందర్భంగా కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ ౖచైతన్య పాఠశాలలో పాఠ్య పుస్తకాలు సీజ్
కొత్తచెరువు: మండలంలోని శ్రీచైతన్య పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్లు చేపట్టి, పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నట్లు గుర్తించిన మండల విద్యాశాఖాధికారి జయచంద్ర శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి పాఠ్య పుస్తకాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకుడు నరేంద్ర మాట్లాడుతూ... ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేసవి సెలవుల్లో ముందస్తు అడ్మిషన్లు చేపట్టి రూ.వేలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేట్‌గా ముద్రించిన పాఠ్య పుస్తకాలు విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌బీ జిల్లా కార్యదర్శి పోతులయ్య, నాయకులు మురళి, సంద కిషోర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.