
● 14 వరకూ దరఖాస్తుకు అవకాశం
హిందూపురం అర్బన్: ఓటరుగా నమోదుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువులో మరో రెండు రోజులే గడువు మిగిలి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈ నెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీకి వయసు 18 ఏళ్లు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని వారు దరఖాస్తు చేసుకోచ్చు. అదే జాబితాలో పేరు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుబంధ జాబితా..
ఓటరు నమోదుకు ఈ నెల 14 వరకు అందిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోపు పరిష్కరించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తారు. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన ఓటరు తుది జాబితాకు అనుబంధ జాబితా రూపొందిస్తారు.
ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు..
కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలనుకుంటే... మీ ప్రాంతంలోని బూత్ లెవల్ అధికారి వద్ద దరఖాస్తు (ఫారం–6) ద్వారా నమోదు చేసుకోవచ్చు. అలా కాకున్నా ఆన్‌లైన్ ద్వారానైనా దరఖాస్తు చేసుకోవచ్చు. www. ceo andhra. nic.in లేదా www. nsvp.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వీలు కల్పించారు.
దరఖాస్తుల సమాచారం..
ఓటరుగా నమోదుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో ఓటరు తన చిరునామా మార్పునకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఓట్ల తొలగింపుకు అవకాశం లేదు..
ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల తొలగింపుకు ఇక ఎలాంటి అవకాశం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. కాగా ఇప్పటి వరకు ఫారం –7 ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ప్రాసెస్ చేస్తారు. ఓటర్ల తొలగింపుకు కొత్తగా ఎలాంటి దరఖాస్తులు స్వీకరించరు.
రూ.2.57లక్షల నగదు సీజ్
ధర్మవరం అర్బన్: ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకెళుతున్న రూ.2.57 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. వివరాలను ధర్మవరం వన్‌టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ధర్మవరంలోని ఎర్రగుంట వై జంక్షన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమంయలో బెంగళూరు రూరల్ జిల్లా హొసకోట మండలం హసిగల్ గ్రామానికి చెందిన కృష్ణమోహన్‌కుమార్ ఎలాంటి రసీదులు లేకుండా రూ.2.57 లక్షలు తరలిస్తూ పట్టుబడ్డాడు. తనిఖీల్లో ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ బాషా, కానిస్టేబుల్ శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.2 లక్షల నగదు పట్టివేత..
హిందూపురం అర్బన్: స్థానిక రహమత్‌పూర్ సర్కిల్‌లో శుకవారం ఉదయం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.2 లక్షల నగదు పట్టుబడింది. విజయవాడ నుంచి వచ్చి హిందూపురంలో ఆటోమొబైల్ పరికరాల వ్యాపారం చేస్తున్న రామకృష్ణ ఎలాంటి రికార్డులు లేకుండా రూ.2 లక్షలు తరలిస్తూ పట్టుబడినట్లు డీఎస్పీ కంజాక్షన్ తెలిపారు.
నేడు ఇంటర్ ప్రవేశ పరీక్ష
లేపాక్షి: మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నట్లు గురుకుల విద్యాలయాల కన్వీనర్ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లేపాక్షి, టేకులోడు, గుండుమల, గుడిబండ, పేరూరు, నసనకోట కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులు 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. లేపాక్షి 180 (బాలురు), టేకులోడు 180 (బాలికలు), గుండుమల 180 (బాలురు), గుడిబండ 140 (బాలికలు) సీట్లు ఉన్నాయని తెలిపారు. మొత్తం 680 సీట్లుకు గాను 2,233 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
