సమస్యల పరిష్కారానికే ‘కరెంటోళ్ల జనబాట’
● కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్
ప్రశాంతి నిలయం: క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను వెంటనే గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని పరిష్కారం చూపించాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించి నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేయడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ సూర్యనారాయణ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, ఆర్డీఓ సువర్ణ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీల పరిష్కారంలో అలసత్వం సహించం
● కలెక్టర్ శ్యాం ప్రసాద్
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి అందే అర్జీలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 330 అర్జీలు అందగా..వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. అర్జీల పరిష్కారం కోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్యను పరిష్కరించాలన్నారు. అంతకుముందు పలువురు దివ్యాంగులు తమ సమస్యలపై అర్జీలిచ్చేందుకు రాగా, కలెక్టర్ వేదిక నుంచి కిందకు దిగి వారి వద్దకు వెళ్లి సమస్యలు విని అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నేర నియంత్రణకు
పకడ్బందీ చర్యలు
● ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడి
హిందూపురం: జిల్లాలో నేర నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన హిందూపురంలో పర్యటించారు. డీఎస్పీ మహేష్‌తో కలిసి బైక్‌పై పర్యటిస్తూ వాహన రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పట్టణంలోని ప్రధాన రహదారులు, రద్దీగా ఉన్న కూడళ్లలో 146 అత్యాధునిక ఫీచర్లతో కూడిన సీసీ కెమెరాలు అమర్చి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్, బస్టాండు పరిసరాల్లో నిరంతర నిఘా ఉంచుతామన్నారు. అలాగే రాత్రి వేళల్లో నిఘా కోసం నైట్ బీట్ సిబ్బంది మరింత పకడ్బందీగా పనిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అలాగే నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో పట్టణాన్ని పరిశీలిస్తుంటామన్నారు. ఎస్పీ వెంట సీఐలు రాజగోపాల్ నాయుడు, అబ్దుల్ కరీం, జనార్దన్, పలువురు ఎస్‌ఐలు ఉన్నారు.
సమస్యల పరిష్కారానికే ‘కరెంటోళ్ల జనబాట’
సమస్యల పరిష్కారానికే ‘కరెంటోళ్ల జనబాట’


