విదేశాలకు నిలిచిన అరటి ఎగుమతి
తాడిపత్రి రూరల్: ఎగుమతుల ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్‌కు భారీగా ఆదాయం ఉండేది. ప్రతి నెలా ఆరు నుంచి ఎనిమిది సార్లు అరటి గెలలను ముంబయికి రవాణా చేసేవారు. ప్రతి సారి 600 నుంచి 700 టన్నుల కాయలు మొత్తం 36 నుంచి 40 కంటైనర్ల ద్వారా ఎగుమతి అయ్యేవి. తాడిపత్రి నుంచి ముంబయికి ఒకసారి అరటి కాయలను ఎగుమతి చేస్తే రైల్వేకి దాదాపు రూ.17లక్షల అదాయం సమకూరేది. ఈ మూడు నెలల పాటు అరటి ఎగుమతి ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి రూ.3.50 కోట్ల ఆదాయం రైల్వేకు సమకూరేది.
అరటికి తగ్గిన డిమాండ్..
తాడిపత్రి ప్రాంతం అరటికి విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఆయా కంపెనీలు రైలు మార్గం ద్వారా ముంబయికి రవాణా చేయడం లేదని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మహారాష్ట్రలో ఎక్కువగా అరటి సాగులోకి రావడంతో పాటు రవాణా ఖర్చులు కూడా కలసి వస్తుండడంతో అక్కడి అరటి కొనుగోలుకు ట్రేడర్లు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఫలితంగా తాడిపత్రి నుంచి అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో తోటల నుంచి కంటైనర్లను తీసుకువచ్చే వాహనాలకు బాడగలు లేకుండా పోయాయి. కంటైనర్లలోకి అరటి బాక్స్‌లను లోడ్ చేయడం, చెట్ల నుంచి అరటి గెలలను కోయడం, వాటిని రసాయనాల్లో ముంచడం, కాయలను గ్రేడింగ్ చేయడం వంటి పనులు లేక వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారు.
రూ.3.50 కోట్ల రైల్వే ఆదాయానికి గండి
గతంలో రైల్వే ఏసీ కంటైనర్ల ద్వారా ఎగుమతి
ఈ ఏడాది తాడిపత్రి నుంచి విదేశాలకు అరటి ఎగుమతి చేసే అవకాశాలు కనిపించడం లేదు. తాడిపత్రి రైల్వే స్టేషన్ ద్వారా ఏటా నవంబర్ నుంచి ఏసీ కంటైనర్లతో ముంబయి మీదుగా అరటిని విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది డిసెంబర్ నెల వచ్చినా ఒక్క కంటైనర్ కూడా తాడిపత్రి నుంచి ఎగుమతి కాలేదు.


