ఫైనల్ రౌండ్‌కు తమిళనాడు
● ముగిసిన సంతోష్ ట్రోఫీ గ్రూప్ జీ మ్యాచ్‌లు
అనంతపురం కార్పొరేషన్: కొన్ని రోజులుగా ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ గ్రూప్ జీ మ్యాచ్‌లు ఆదివారంతో ముగిశాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌ల్లో తమిళనాడు జట్టు 9 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి ఫైనల్ రౌండ్ పోటీలకు జట్టు అర్హత సాధించింది. 6 పాయింట్లతో రెండో స్థానంలో పాండిచ్చేరి, మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఆంధ్ర , చివరి స్థానంలో అండమాన్ నికోబార్ జట్టు నిలిచాయి.
చివరి లీగ్‌లో నెగ్గిన ఆంధ్ర
చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 1–0 పాయింట్ల తేడాతో అండమాన్ నికోబార్ జట్టుపై విజయం సాధించింది. జట్టులో అక్ష రెడ్డి అద్భుత గోల్‌తో ఆంధ్ర విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఎన్నో ఏళ్ల తర్వాత సంతోష్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయం సాధించడం గమనార్హం. మరో మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 3–0 గోల్స్ తేడాతో పాండిచ్చేరిపై విజయం సాధించింది.
పుట్‌బాల్‌కు ఆదరణ ఎక్కువ
ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పుట్‌బాల్‌కు మంచి ఆదరణ ఉందన్నారు. సంతోష్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయం సాధించడం క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపుతుందన్నారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. పుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డేనియల్ ప్రదీప్ మాట్లాడుతూ... ఏపీఎఫ్‌ఏ అధ్యక్షుడు కోటగిరి నాయకత్వంలో ఏపీలో పుట్‌బాల్ క్రీడ పుంజుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది ఔత్సాహికులు పుట్‌బాల్ నేర్చుకుంటున్నారన్నారు. జూనియర్ గరల్స్ విభాగంలో ఏపీ జట్టు ఆల్ ఇండియాలో 7వ ర్యాంకు సాధించిందన్నారు. కార్యక్రమంలో పుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, ఏపీఎఫ్‌ఏ కో ఆర్డినేటర్ రాయచోటి శ్రీనివాసులు, సిబ్బంది కిషోర్, చినరాజప్ప, సిరివెళ్ల శ్రీకాంత్, సాగర్, నాని పాల్గొన్నారు.


