వివాహిత అనుమానాస్పద మృతి
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు గ్రామానికి చెందిన హరిజన నాగరాజు భార్య ప్రవల్లిక (30) నాలుగు రోజులు క్రితం తన ఇంట్లో శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆస్పత్రిలో ఆమె మృతి చెందింది. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, ప్రవల్లిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు తల్లి రామసుబ్బమ్మ ఫిర్యాదు చేసింది. తన కూతురు ప్రవల్లికతో నార్పల మండలం నల్లపరెడ్డిపల్లికి చెందిన ప్రహ్లాదరెడ్డి సన్నిహితంగా ఉండేవాడని, నాలుగు రోజుల క్రితం (గురువారం రాత్రి) మామిళ్లపల్లిలోని తన కూతురు ఇంటి వచ్చిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. అతని వైఖరి కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, ప్రహ్లాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది. దీంతో ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ ఆదేశాల మేరకు కనగానపల్లి పోలీసులు, క్లూస్‌టీం సిబ్బంది మామిళ్లపల్లిలోని మృతురాలి ఇంటికి ఆదివారం చేరుకుని పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి కూడా మృతురాలి ఇంటిని పరిశీలించి ప్రవల్లిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి కారకులైన వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని పోలీసులను కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రహ్లాదరెడ్డి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ రిజ్వాన్ తెలిపారు.


