కలలో కనిపించి.. ఇలలో కొలువుదీరి
పావగడ: నాగలమడక గ్రామంలోని అంత్య సుబ్రహ్మణ్యం స్వామి సర్వాంతర్యామిగా వెలుగొందుతున్నాడు. ఏడు పడగల సర్పాకార సుబ్రహ్మణ్యం స్వామి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచాడు. దక్షిణ కర్ణాటక లోని ఆది కుక్కె సుబ్రహ్మణ్యం స్వామి, దొడ్డబళ్లాపురంలోని మధ్య ఘాటి సుబ్రహ్మణ్యం స్వామి, నాగలమడకలోని అంత్య సుబ్రహ్మణ్యం స్వామి ఆలయాలను వరుసగా దర్శించి పూజలు నిర్వహించడం భక్తులకు ఆనవాయితీ.
భక్తుల కొంగు బంగారంగా..
పూర్వం నాగలమడక గ్రామంలో అన్నంభట్లు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కుక్కె ఆలయం నుంచి వచ్చి ఇక్కడ చేరుకున్నాడు. ఒక రాత్రి సుబ్రహ్మణ్యం స్వామి అతని కలలో వచ్చి తాను ఏడు పడగల సర్పాకారంలో పక్కనే ఉన్న పెన్నానది ఇసుక లో దాగి ఉన్నానని తనను వెలికి తీసి పెన్నానది ఒడ్డున ప్రతిష్టించాలని కోరాడు. ఆ మరుసటి రోజే అన్నంభట్లు ఏటిలోని ఇసుకను నాగలితో దున్నగా ఆశ్చర్యంగా ఓ ఏడు పడగల సర్పాకార శిల నాగలి చాలుకు దొరికింది. ఆ ఉద్భవ మూర్తిని ఏటి ఒడ్డున చిన్న బండల గుడి కట్టి ప్రతిష్టించాడు. అప్పటి నుంచి ఆ గ్రామానికి నాగలమడక గా పేరు వచ్చింది. తదనంతరం కొన్నాళ్లకు సమీపంలోని ఆంధ్రకు చెందిన రొద్దం గ్రామం నుంచి వర్తకుడు సుబ్బయ్య శెట్టి ఎడ్లబండి లో వ్యాపార నిమిత్తం బళ్లారి కి వెళ్తూ నదీ తీరాన విశ్రమించాడు. తన వ్యాపారం లాభసాటి గా సాగితే స్వామి వారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నాడు. మొక్కు నెరవేరగా సుబ్బయ్య శెట్టి స్వామి వారికి ఆలయం కట్టించాడు. అప్పటి నుంచి నేటి వరకు సుబ్బయ్య శెట్టి వారసులే అంకురార్పణ ఫూజలు నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు. అంచెలంచెలుగా ఆలయ అభివృద్ధి జరిగి నేడు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది.
ఎంతో రుచిరా..
నాగల మడక షష్టి సందర్భంగా ఉత్తర పినాకిని ఏటి ఒడ్డున భక్తులు తమ ఇష్టదైవమైన సుబ్రహ్మణ్యం స్వామి ప్రసాదంగా కట్టెల పొయ్యి మీద వండే పెసర పులగం, వంకాయబజ్జి వంటకం ఎంతో రుచిగా ఉంటుంది. వేడిగా ఉండే పులగం వంకాయ బజ్జిలోకి నెయ్యి వేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. అన్ని ప్రసాదాల్లోకి పెసర పులగం, వంకాయబజ్జి ప్రసాదం మొదటి స్థానంలో ఉంటుందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు.
భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న అంత్యసుబ్రహ్మణ్య స్వామి
24 నుంచి నాగల మడకలో బ్రహ్మోత్సవాలు
కలలో కనిపించి.. ఇలలో కొలువుదీరి


