పెనుకొండలో పంచ‘బూతాలు’ | - | Sakshi
Sakshi News home page

పెనుకొండలో పంచ‘బూతాలు’

Dec 23 2025 6:51 AM | Updated on Dec 23 2025 6:51 AM

పెనుక

పెనుకొండలో పంచ‘బూతాలు’

పెనుకొండ: నియోజకవర్గంలో అనధికారిక ‘ఫైవ్‌ మెన్‌ కమిటీ’ కర్ర పెత్తనం పెరిగిపోయింది. ఆ ఐదుగురి టీడీపీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ ..ఇలా అన్ని శాఖలను తమ కనుసన్నల్లో పెట్టుకుని చెలరేగిపోతున్నారు. రియల్‌ ఎస్టేట్‌, కాంట్రాక్టులు, భూసేకరణ, ‘కియా’ వ్యవహారాలు, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఇతరత్రా వ్యవహారాలన్నీ వారే నడిపిస్తున్నారు. ఒక్కో నాయకుడు ఒక్కో ప్రభుత్వ కార్యాలయాన్ని పంచుకున్నారు. వారి కనుసన్నల్లోనే కార్యాలయాల్ని నడుపుతున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సవిత ఆధ్వర్యంలోనే ఆ ఐదుగురు నేతలు పనిచేస్తున్నారని, అక్రమ వసూళ్ల మొత్తమంతా మంత్రి ఇంటికే చేరుతోందని టీడీపీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. మంత్రి కూడా ఆ ఐదుగురికే ప్రాధాన్యం ఇస్తున్నారని, వారు చెబితే చాలు అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పనిచేసి పెడుతున్నారని, వారు ధనార్జనలో మునిగిపోయినా పట్టించుకోవడం లేదని ఆ వర్గం అంటోంది.

ఊరూరా దందానే..

పెనుకొండ నియోజకవర్గంలోని దుద్దేబండ, గొందిపల్లి, గుట్టూరు, అమ్మవారుపల్లి, పెనుకొండ, ఎర్రమంచి, సోమందేపల్లి మండలంలోని సోమందేపల్లి, నడింపల్లి గ్రామాల్లో మంత్రి అనుచరులు రూ.కోట్ల మట్టి దందా సాగిస్తున్నారని, అధికారులు సైతం మంత్రికి భయపడి చేతులు కట్టుకుని కూర్చున్నారని టీడీపీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఇటీవల పెనుకొండ మండలం మావటూరు గ్రామంలో రొద్దంకు చెందిన ఓ టీడీపీ నాయకుని అండతో ఏకంగా బస్‌షెల్టర్‌నే కూల్చివేశారు. మంత్రి అండ చూసుకుని రెచ్చిపోతున్న ఆమె అనుచరుల ఆగడాలకు ఈ ఘటన నిదర్శనమని చెబుతున్నారు.

అధికారులపై పెత్తనం..

మంత్రి అనుచరులు, ‘ఫైవ్‌ మెన్‌ కమిటీ’ సభ్యుల దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులెవరూ ముందుకు రావడం లేదు. రెవెన్యూ అధికారులైతే పెనుకొండ నియోజకవర్గమంటేనే భయపడిపోతున్నారు. అందుకే నియోజకవర్గ కేంద్రమైన పెనుకొండతో పాటు సోమందేపల్లిలో తహసీల్దార్‌ పోస్టులు ఖాళీగా ఉండగా..ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా సోమందేపల్లి మండలంలో భూ వివాదాల కేసులు భారీగా ఉన్నాయి. వీటికి సంబంధించి తహసీల్దార్‌ తరచూ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో ఈ మండలం అంటేనే జంకుతున్నారు. ఇక మంత్రి అనుచరుల్లోని యువకులు స్థాయి మరచి అధికారులపై పెత్తనం చేస్తున్నారు. వేలు చూపిస్తూ తమ పనిచేయాల్సిందేనంటూ ఆదేశాలిస్తున్నారు. దీంతో ఇప్పటికే పనిచేస్తున్న అధికారులు మానసిక వేదనకు గురవుతున్నారు. పెనుకొండలో మంత్రి అనుచరుల ఒత్తిడి అధికంగా ఉంటుందన్న భయంతో ఈ మండలానికి తహసీల్దార్‌గా రావడానికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖల్లోని ప్రతి పనికీ తమకు వాటా ఇవ్వాలని మంత్రి అనుచరులు హుకుం జారీ చేస్తుండడంతో అధికారులు హడలిపోతున్నారు.

అధిష్టానానికి ఫిర్యాదులు..

పెనుకొండ నియోజకవర్గంలో ‘ఫైవ్‌ మెన్‌ కమిటీ’ పేరుతో సాగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగం, చివరకు పార్టీ నాయకులు, కార్యకర్తలపైనా మంత్రి చిన్నచూపు..తదితర అంశాలపై ఓ మాజీ ఎమ్మెల్యే ద్వారా పార్టీ అధినేత చంద్రబాబుకు ఎప్పటికప్పుడు రిపోర్ట్‌ వెళ్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో ఉన్న నాయకుడి అనుచర వర్గంతో సరిపోకే సవితకు మద్దతుగా నిలిచామని, ఇప్పుడు ఆమె కూడా అదే దారిలో వెళ్తే..తాము మరోదారి చూసుకోవాల్సి వస్తుందని టీడీపీలోని కొందరు సీనియర్లు చెబుతున్నారు.

‘‘టీడీపీనే ప్రాణం అనుకున్నాం. కానీ ఇప్పుడది పార్టీలాగా లేదు. కొందరి అక్రమార్జనకు కేంద్ర బిందువుగా మారిపోయింది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి కనీస గుర్తింపు లేదు. ఏదైనా సమస్య చెప్పినా స్పందించే నాయకుడు లేడు. ఇక ఈ రాజకీయాలు మాకొద్దు.’’

– మునిమడుగుకు చెందిన టీడీపీ యూత్‌ లీడర్‌ ఆవేదన ఇది. ఇలా ఒక్కరు..ఇద్దరు కాదు.. పెనుకొండ టీడీపీ కార్యకర్తలంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సవిత నియోజకవర్గ వ్యవహారాలన్నీ ‘ఫైవ్‌ మెన్‌’కు అప్పగించడంతో వారు అక్రమ సంపాదనే ధ్యేయంగా రెచ్చిపోతున్నారు.

నియోజకవర్గాన్ని ఏలుతున్న ‘ఫైవ్‌ మెన్‌’ అక్రమాలు, దౌర్జన్యాలతో రెచ్చిపోతున్న వైనం మంత్రి సవిత అండదండలే కారణం!

పెనుకొండలో పంచ‘బూతాలు’1
1/1

పెనుకొండలో పంచ‘బూతాలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement