‘నకిలీ’ ఏరివేతకు రంగం సిద్ధం
మడకశిర: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి సారించారు. అగళి మండలం కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 3,981, బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 1,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కావడంతో రాష్ట్ర స్థాయి అధికారులే రంగంలోకి దిగారు. జిల్లాలో ఇంకా ఏ పంచాయతీ నుంచైనా నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ పంచాయతీల నుంచి ఇటీవల కాలంలో జారీ అయిన అన్ని బర్త్ సర్టిఫికెట్లను పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బర్త్ సర్టిఫికెట్లు ఎక్కువగా జారీ చేసిన పంచాయతీల నుంచి ప్రక్రియ ప్రారంభించారు.
రాష్ట్ర జనన, మరణ నమోదుశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఇప్పటికే విచారణ చేపట్టిన జిల్లా నోడల్ ఆఫీసర్, విచారణ అధికారి కళాధర్ కలిసి పలు వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమైనా ఉందా? లేదా హ్యాకర్ల పనేనా అని ఆరా తీసినట్లు తెలిసింది.
జనన, మరణ నమోదుశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు జిల్లా పర్యటనలో భాగంగా తొలిరోజు సోమవారం గోరంట్ల, చిలమత్తూరు, సోమందేపల్లి, లేపాక్షి పంచాయతీల్లో పర్యటించారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఇటీవల జారీ అయిన బర్త్ సర్టిఫికెట్లను పునఃపరిశీలన చేసినట్లు సమాచారం.
జిల్లాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు వెలుగు చూసిన నేపథ్యంలో జనన, మరణ నమోదు శాఖ అధికారులు అన్ని గ్రామ పంచాయతీల్లో పునఃపరిశీలన చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ దశల వారీగా కొనసాగనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కువ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయో... ఆ గ్రామ పంచాయతీలను గుర్తించి పునఃపరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ జిల్లా పర్యటనకు వచ్చి ఇప్పటికే జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించినట్లు తెలిసింది.
నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై
దృష్టి సారించిన ఉన్నతాధికారులు
జిల్లా నుంచి జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ల పునఃపరిశీలనకు శ్రీకారం
జిల్లా పర్యటనకు వచ్చిన జనన,
మరణ నమోదు శాఖ డీడీ
నాలుగు పంచాయతీల్లో పరిశీలన
అన్ని పంచాయతీల్లో
బర్త్ సర్టిఫికెట్ల పునఃపరిశీలన..
జిల్లాకు వచ్చిన డిప్యూటీ డైరెక్టర్
శ్రీనివాసరావు


