రమణీయం.. రథోత్సవం | Sakshi
Sakshi News home page

రమణీయం.. రథోత్సవం

Published Sat, Apr 13 2024 12:10 AM

అశేష భక్తజన సందోహం మధ్య సాగుతున్న చౌడేశ్వరీదేవి రథోత్సవం - Sakshi

హిందూపురం: మండలంలోని కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వరీదేవి అమ్మవారి రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివరావడంతో కొటిపి గ్రామం కిక్కిరిసింది. ఏటా ఉగాది పండుగ అనంతరం అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం ఆవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామునే అమ్మవారి మూలవిరాట్‌ను పట్టువస్త్రాలు, వివిధ పుష్పాలతో అలంకరించారు. ఆకుల తోరణాలు కట్టి తీర్చిదిద్దారు. భారీగా తరలివచ్చిన భక్తులు అర్చనలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని అత్యంత శోభాయమానంగా ముస్తాబు చేసి రథంలో కొలువుదీర్చారు. ‘చౌడేరీశ్వరీ పాహిమాః’ అంటూ భక్తులు అమ్మవారిని కీర్తిస్తుండగా రథం ముందుకు కదిలింది. మేళతాళాలతో గ్రామ వీధులు గుండా ఊరేగింపు అనంతరం రథం తిరిగి ఆలయం వద్దకు చేరింది. ఈ రథోత్సవానికి హిందూపురం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. రథోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారికి వడిబియ్యం అందించి మొక్కులు తీర్చుకున్నారు. కొటిపి గ్రామస్తులు బంధువులు, సన్నిహితులను ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. రాత్రి ఆలయ కమిటీ ప్రత్యేక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. హిందూపురం రూరల్‌ సీఐ ఈరన్న ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఘనంగా కొటిపి చౌడేశ్వరీదేవి

రథోత్సవం

భారీగా తరలివచ్చిన భక్తులు

విశేష అలంకరణలో కొటిపి గ్రామ దేవత చౌడేశ్వరీదేవి
1/1

విశేష అలంకరణలో కొటిపి గ్రామ దేవత చౌడేశ్వరీదేవి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement