●గాలీవాన బీభత్సం

పుట్టపర్తి అర్బన్: గాలీవాన బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి పుట్టపర్తి, కొత్తచెరువు మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి పెనుగాలులు తోడుకావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేల కూలాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. కప్పబండ నుంచి కొత్తచెరువు వరకూ దాదాపు 9 విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో గురువారం రాత్రంతా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. శుక్రవారం ఉదయమే అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. జేసీబీలతో భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఇక కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్‌ను పునరుద్ధరించినట్లు ఏఈ శ్రీనివాస్ నాయక్ తెలిపారు.
8 మండలాల్లో వర్షం..
గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలో 8 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పుట్టపర్తి మండలంలో అత్యధికంగా 22.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక చెన్నేకొత్తపల్లిలో 11.4 మి.మీ, కొత్తచెరువు 5.8, కనగానపల్లిలో 5.4, తాడిమర్రి 4.2, బుక్కపట్నం 4, చిలమత్తూరు, హిందూపురం మండలంలో 3.8 మి.మీ మేర వర్షం కురిసినట్లు వెల్లడించారు.