పచ్చపోలీస్‌ ఓవరాక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పచ్చపోలీస్‌ ఓవరాక్షన్‌

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

● మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి వాహనాన్ని అడ్డుకుని సీఐ వీరంగం

● తిక్కవరం బూత్‌లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు లాగేసిన ఎస్సై

● రిగ్గింగ్‌ జరుగుతున్న సమాచారంతో బయలుదేరిన విక్రమ్‌రెడ్డికి నిర్బంధం

● మంత్రి ఆనం ఇలాకాలో కూటమి

రికార్డు బ్రేక్‌

● సహకరించిన తప్పుడు పోలింగ్‌

అధికారులు

● మొదటి గంటలోనే వైఎస్సార్‌సీపీ

ఏజెంట్లను తరిమేశారు

● జాబితాలో 586 ఓటర్లు..

ఓటు వేసింది 611 మంది

● తూర్పుపల్లిలో కూటమి రిగ్గింగ్‌

మర్రిపాడు: ఆత్మకూరు సీఐ గంగాధర్‌ గురువారం జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో ఖాకీ చొక్కా విడిచి పచ్చచొక్కా ధరించి.. ఖాకీ ముసుగులో ఓవరాక్షన్‌ చేశారు. అధికార పార్టీ నేతలు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మెప్పు పొందేందుకు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డిని సైతం అక్రమంగా నిర్బంధించి స్వామి భక్తి ప్రదర్శించారు. మర్రిపాడులో ఓటమి భయంతో నామినేషన్ల పరిశీలనలో కొన్ని.. విత్‌డ్రా పర్వంలో మరి కొన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరిస్కరించి.. ఉపసంహరించి.. టీడీపీకి ఏకగ్రీవం చేశారు. గురువారం జరిగిన మరి కొన్ని సెగ్మెంట్ల ఎన్నికల్లోనూ అక్రమాలకు పాల్పడమంటూ బరితెగించారు. అడ్డగోలుగా పోలింగ్‌ చేసి గెలవాలంటూ కార్యకర్తలను, నేతలను పురమాయించారు. పలు బూత్‌ల్లో రిగ్గింగ్‌ చేసుకునేందుకు సహకరించాలని పోలీసులను ఆదేశించారు. మండలంలోని తిక్కవరంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా ఉన్న రవీంద్రబాబు, నారాయణస్వామి, విజయ్‌కుమార్‌లను స్థానిక ఎస్సై బలరామిరెడ్డి మీపై బైండోవర్‌ కేసు ఉందంటూ ఆ ముగ్గురిని బలవంతంగా బయటకు పంపించేశారు. అనంతరం టీడీపీ నేతలు అరగంట పాటు 200 ఓట్లు రిగ్గింగ్‌ చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి హడావుడిగా తిక్కవరం వెళ్తుండగా ఆత్మకూరు సీఐ గంగాధర్‌ తన వాహనాన్ని అడ్డు పెట్టి మీరు వెళ్లేందుకు వీల్లేదంటూ నానాయాగి చేశారు. తాను జెడ్పీటీసీ ఎన్నికలకు చీఫ్‌ ఏజెంట్‌నని అనుమతి పత్రం చూపిస్తున్నా.. పట్టించుకోకుండా సీఐ అరగంట పాటు విక్రమ్‌రెడ్డిని అడ్డుకున్నారు. ఈ లోపే తిక్కవరంలో టీడీపీ మూకలు రిగ్గింగ్‌ చేసుకున్నారు. ఆ సమాచారం సీఐకు అందాక అక్కడికి వెళ్లేందుకు వాహనాన్ని వదిలేశారు.

ప్రజాస్వామ్యం అపహాస్యం

ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో 30 ఎంపీటీసీ సెగ్మెంట్‌లను ఏకగ్రీవం చేసుకున్నారని, 37 సెగ్మెంట్లకు జరుగుతున్న ఎన్నికల్లో కూడా మంత్రి ఆనం రిగ్గింగ్‌లకు పాల్పడుతూ ముందుగానే ఓటమి అంగీకరించారన్నారు. ఎస్సై బలరామిరెడ్డి అధికార పార్టీకి సాధ్యమైనంత మేర సేవ చేశారని, మా ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేసి బయటకు తీసుకొచ్చారని, ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీని ఎదుర్కొనలేమనే ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

వారెవ్వా.. 104.27 శాతం పోలింగ్‌

చేజర్ల: మండలంలోని తూర్పుపల్లి పోలింగ్‌ స్టేషన్‌ 25లో పోలింగ్‌ శాతం రికార్డు బద్దలు కొట్టింది. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో కూటమి నేతలు, పోలింగ్‌ అధికారులు ఏకంగా 104.27 శాతం పోలింగ్‌ నిర్వహించి చరిత్ర సృష్టించారు. గురువారం పోలింగ్‌కు ముందు మంత్రి ఆనం తన అనుచరులకు ఫోన్‌ చేసి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగ్‌ చేయాలని ఆదేశించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు బరితెగించి చేసిన రిగ్గింగ్‌ బట్టబయలైంది. తూర్పుపల్లిలోని పోలింగ్‌ స్టేషన్‌ 25లో మొత్తం ఓటర్లు 586 మంది ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ తరఫున కూర్చున్న ఎన్నికల ఏజెంట్లను తొలి గంటలోనే బయటకు తరిమేశారు. ఆ తరువాత కూటమి నేతలు ఓటరు జాబితాలో ఉన్న అందరి ఓట్లను చనిపోయిన ఓటర్లతో సహా ఓటు వేసినట్లు బ్యాలెట్‌ బాక్స్‌లో నింపారు. కూటమి నేతలు అంతటితో తృప్తి తీరక అదనంగా మరో 25 బ్యాలెట్లను కూడా బాక్స్‌లో వేశారు. ఎన్నికల అధికారులు మొత్తం బ్యాలెట్లను లెక్క పెట్టి పోలైన ఓట్ల బ్యాలెట్లను చివరిలో సరి చూడగా 611 ఓట్లు పోలైనట్లు 104.27 శాతం నమోదైనట్లు పోలింగ్‌ అధికారి మండల అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదే సమాచారాన్ని జిల్లా అధికారులు కూడా పంపారు. అధికారులు అధికారికంగా వెల్లడించిన పోలింగ్‌ శాతం బయటకు పొక్కడంతో నేతలు చేసిన ఓట్ల దొంగతనం బయటపడి ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement