నెల్లూరు(టౌన్): స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేవలం 184 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తూ గతనెలలో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. వీటిల్లో కూడా 19 పోస్టులు ప్రత్యేక విద్యకు సంబంధించినవి ఉన్నాయి. రెండో విడత డీఎస్సీ నోటిఫికేషన్‌లో కటాఫ్‌ను ఎక్కడా తీసుకోలేదు. జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు కూడా స్పష్టత లేదు. పైనుంచే నోటిఫికేషన్ విడుదల చేశారని చావు కబురు చల్లగా చెబుతున్నారు. అయితే డీఎస్సీ షెడ్యూల్ కోసం జిల్లాలో 30 వేల మందికి పైగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ లెక్కన 184 పోస్టులకు సంబంధించి ఒక్కో దానికి దాదాపు 163 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడాల్సి ఉంది.
సబ్జెక్టుల వారీగా..
165 పోస్టులు పాఠశాలలు, 19 ప్రత్యేక విద్యకు సంబంధించినవి. ఈనెల 11వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్టుల వారీగా ఎస్‌ఏ (తెలుగు) – 15, హిందీ – 11, ఇంగ్లిష్ – 7, ఉర్దూ – 8, సంస్కృతం – 2, ఫిజికల్ సైన్స్ – 1, బయలాజికల్ సైన్స్ – 3, సోషల్ స్టడీస్ – 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ – 13, ప్రత్యేక విద్య – 8 పోస్టులున్నాయి. అదే విధంగా ఎస్జీటీల్లో తెలుగు 97, ఉర్దూ – 3, ప్రత్యేక విద్య – 11 ఉన్నాయి.
అధికంగా ఖాళీలు
జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలను పరిగణలోకి తీసుకుంటే సుమారు 800కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే దాదాపు 700కు పైగా ఎస్జీటీ ఖాళీలున్నాయి. ప్రస్తుతం 111 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటికీ జిల్లా వ్యాప్తంగా 100కు పైగా ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలున్నాయి. రెండో పోస్టు ఉన్నా టీచర్ లేని పరిస్థితి ఉంది. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 300 మందికి పైగా మిగులు టీచర్లున్నారు. అయితే వారంతా ఒకే సబ్జెక్ట్ టీచర్లు కావడంతో మండల రీసోర్స్ కేంద్రాలకు పరిమితం చేశారు. ఏదైనా పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ సెలవు పెడితే వారి స్థానంలో పంపిస్తున్నారు. ప్రధానంగా సోషల్, హిందీ, ఇంగ్లిష్, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి 100 మందికి పైగా టీచర్ల కొరత ఉంది. అయితే ఈ నోటిఫికేషన్‌లో కేవలం 65 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. వీటిల్లో కూడా 8 పోస్టులు ప్రత్యేక విద్యకు సంబంధించినవి.
టీచర్లు లేక ఇబ్బందులు
జిల్లాలో మెజార్టీ ఉన్నత పాఠశాలల్లో సరిపడా సబ్జెక్ట్ టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఈ విద్యా సంవత్సరంలో మున్సిపల్ పాఠశాలలను పునః ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పదవ తరగతిలో ఉత్తీర్ణతా శాతం తగ్గడంపై అందరి ముందే జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్లను ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారులు సైతం సబ్జెక్ట్ టీచర్ల కొరతపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని లోలోన మదన పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. తరగతి గదిలో పాఠం అర్థం కాకపోయినా ఇంటికి వెళ్లి ఒకసారి రివిజన్ చేసుకునేవారు. కూటమి ప్రభుత్వంలో ట్యాబ్‌లకు మంగళం పాడారు. దీంతో పాఠశాలల్లో సరిపడా సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో పేద పిల్లలు నష్టపోతున్న పరిస్థితి ఉంది.
ఉన్నత విద్యాశాఖ నుంచి
ప్రకటించారు
డీఎస్సీ షెడ్యూల్ విడుదలైంది. జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలను ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రకటించారు. పరీక్షలు డిసెంబర్ 20 నుంచి జనవరి 13వ తేదీ వరకు రెండు విడతల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లను ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
– ఆర్.బాలాజీరావు, డీఈఓ
జిల్లాలో 700కు పైగా ఎస్జీటీ పోస్టుల ఖాళీ
స్కూల్ అసిస్టెంట్లు 100కు పైగా..
మొత్తంగా 800కు పైగా ఖాళీలు
ఎన్నికల సమయంలో హడావుడిగా
ప్రకటన
బుధవారం అర్ధరాత్రి షెడ్యూల్ విడుదల
11 నుంచి దరఖాస్తుల స్వీకరణ
కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. గతంలో మెగా డీఎస్సీ పేరుతో జిల్లాకు కేవలం 673 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టారు. రెండో ఏడాదైనా మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందని భావించిన వారి ఆశలకు గండి కొట్టారు.


