● పలుచోట్ల వాగులు, వంకల్లోకి నీరు
నెల్లూరు(అర్బన్): జిల్లాలో గురువారం పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. నెల్లూరు నగరంతోపాటు బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు, దగదర్తి, కావలి, వింజమూరు, ఆత్మకూరు, సంగం, చేజర్ల, వెంకటాచలం, పొదలకూరు, విడవలూరు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, కోవూరు, ఇందుకూరుపేట, అనంతసాగరం, మనుబోలు తదితర మండలాల్లో వర్షం నమోదైంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వాన 10:30 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని చెరువులు, వాగుల్లోకి నీరు చేరింది. వర్షం కారణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు కొన్నిచోట్ల సుమారు గంటన్నరపాటు ఆటంకం ఏర్పడింది. జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణం నెలకొంది. అయితే మర్రిపాడు, ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో వర్షం కురవలేదు. కొన్నిచోట్ల మాత్రం తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి.


