ప్రజాస్వామ్యంపై ఖాకీ దాడి | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంపై ఖాకీ దాడి

Oct 24 2026 12:04 AM | Updated on Oct 24 2026 12:04 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే.. రాజ్యాంగ హక్కులను ఖూనీ చేస్తున్నారు. ఖాకీ దుస్తులు ధరించిన కిరాయి గూండాల్లా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో కొందరు పోలీస్‌ అధికారులు ఖాకీ చొక్కాలు వదిలి పచ్చచొక్కాలు తొడిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయొద్దని, ఒకవేళ నామినేషన్‌ దాఖలు చేసి ఉంటే విత్‌ డ్రా చేసుకోమని నేరుగా అభ్యర్థులను బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హుంకరింపులు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సజావుగా ఎన్నికలను జరపాల్సిన పోలీస్‌ అధికారులే అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ డిక్టేటర్లుగా మారుతున్నారు.

ఖాకీలే.. నామినేషన్‌ కేంద్రాలు కబ్జా

పచ్చ నేతలతోపాటు ఖాకీలు సైతం నామినేషన్‌ కేంద్రాలను కబ్జా చేసి ఏకపక్ష ఎన్నికల ప్రక్రియకు తెగబడ్డారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రాలకే రానివ్వకుండా.. కర్రలు, రాడ్లతో యథేచ్ఛగా వచ్చి దాడులకు పాల్పడుతున్నా.. పోలీస్‌ యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. చివరికి మహిళల చీరలు లాగేసి.. చించేసి.. నామినేషన్లు పత్రాలు లాక్కొని వెళ్తున్నా.. నిలువరించకుండా.. చూస్తుండిపోయారు. కొన్ని చోట్ల అయితే.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌ కేంద్రాల వద్దకే రానివ్వకుండా.. పోలీస్‌లు తమదైన కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో పోలీస్‌శాఖ టీడీపీ నేతలకు అడుగులకు మడుగులు ఒత్తుతోంది. సీతారాపురంలో ఎస్సై, ఉదయగిరి సీఐ అభ్యర్థులకు బెదిరింపులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీతారామపురం ఎంపీపీ రేసులో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తన నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో పోలీస్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ కోసం స్టేషన్‌కు వెళ్తే స్థానిక ఎస్సై టీడీపీ నేతగా మారి క్లాస్‌ పీకారంట. ‘నేను చెప్పింది విను. వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్‌ వేయొద్దు. నీవు ప్రచారం కూడా చేసుకోలేవు.. నీపై హత్యాయత్నం కేసులు నమోదు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. నామినేషన్‌ వేసిన తర్వాత కూడా ఎస్సైతోపాటు సీఐ కూడా మరోసారి విత్‌డ్రా చేసుకోమని బెదిరింపులకు దిగారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

చిల్లకూరులో..

గూడూరు నియోజకవర్గం చిల్లకూరు ఎస్సై కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టార్గెట్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. మండలంలో ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, స్థానిక నేతలకు కౌన్సెలింగ్‌ పేరుతో స్టేషన్‌కు పిలిపించి ఎవరూ కూడా నామినేషన్లు దాఖలు చేయొద్దని, నామాట కాదని నామినేషన్‌ వేస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతానంటూ బెదిరింపులకు దిగినట్లు నేతలు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఎస్టీ, ఎస్సీలకు రిజర్వు అయిన మూడు ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసేందుకు భయపడినట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ స్థానం కూడా ఎస్టీకి రిజర్వు కావడంతో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ అభ్యర్థిని సిద్ధం చేయగా, సదరు అభ్యర్థిని సైతం బెదిరించడంతో ఏకంగా ఊరు వదిలేసి వెళ్లిపోవడంతో ఆ మండలం నుంచి అభ్యర్థిని పోటీ పెట్టలేకపోయామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్సై తీరుపై మండల ప్రజలు మండి పడుతున్నారు. స్టేషన్‌కు వెళ్లాలంటే పచ్చ పార్టీ బ్యాడ్జి వేసుకుని వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. పచ్చచొక్క తొడగకపోతే వారికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బెదిరింపులు

అక్రమ కేసుల్లో ఇరికిస్తామంటూ

హుంకరింపులు

సీతారామపురంలో ఎంపీపీ అభ్యర్థికి ఎస్సై, సీఐ వార్నింగ్‌లు

చిల్లకూరులో ఎంపీటీసీ అభ్యర్థులపై ఎస్సై ఒత్తిళ్లు

నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలని బలవంతం

పచ్చ చొక్కాలు తొడిగిన రక్షక భటులు

కళ్లముందే నామినేషన్లు చించేస్తున్నా..

జిల్లాలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రాల్లో పోలీస్‌ శాఖ రూల్స్‌ బ్రేక్‌ చేస్తోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మాత్రం పక్కాగా రూల్స్‌ అంటూ అభ్యర్థితోపాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు. కొన్ని చోట్ల నామినేషన్ల కేంద్రాల వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థులను మాత్రం గుంపులుగా వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. ఎవరైనా పోలీస్‌ను ప్రశ్నిస్తే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మర్రిపాడులో శుక్రవారం టీడీపీ అభ్యర్థి ఏకంగా ఎన్నికల అధికారి చేతిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను లాక్కోని చించి వేయడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గూడూరు నియోజకవర్గంలో పోలీస్‌ శాఖ ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. నామినేషన్ల కేంద్రాల వద్దే టీడీపీ మూకలు మోహరించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా భౌతిక దాడులకు పాల్పడుతుంటే పోలీస్‌ యంత్రాంగం వారికి సహకరిస్తూ.. ప్రేక్షపాత్ర పోషించింది. తిరుపతి జిల్లా వాకాడులో కూడా వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పిందే వేదంగా భావించి ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement