సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే.. చడ్డీ గ్యాంగ్ తరహాలో ఓ ఫాంహౌస్‌లోకి చొరబడ్డారు. వైఎస్సార్‌సీపీలో కీలక నేతలపై అక్రమ కేసులు బనాయించేందుకు పోలీసులను ఇలా బరితెగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న టీడీపీ ఖాకీ అస్త్రాన్ని ప్రయోగించింది. గూడూరు నియోజకవర్గ సీనియర్ నేత ఎద్దల నరేందర్‌రెడ్డిని ఎలాగైనా అక్రమ కేసులో ఇరికించేందుకు ఖాకీలు చేసిన ప్రయత్నాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బట్టబయలయ్యాయి. ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సునిల్ కుమార్ అడ్డాదారుల్లో గెలిచేందుకు పోలీసులను వాడుకున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎద్దల నరేందర్‌రెడ్డిని టార్గెట్ చేస్తే పార్టీ కేడర్ భయపడుతుందని భావించి నేరుగా అతడినే టార్గెట్ చేశారు. గూడూరు రూరల్ పరిధిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్‌లో అర్ధరాత్రి వేళ గూడూరు పట్టణ, రూరల్ పోలీసులు చొరబడ్డారు. ఫామ్‌హౌస్ గోడలు దూకి లోపలికి వెళ్లారు. అక్కడ నరేందర్‌రెడ్డి ఉండి ఉంటే గంజాయి లేదా విదేశీ మద్యం ఉంచి కేసు నమోదు చేసేందుకు యత్నించారు. అయితే ఆ సమయంలో నరేంద్రరెడ్డి ఫామ్ హౌస్‌లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తయయ్యాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గూడూరు వైఎస్సార్‌సీపీ నేత ఎద్దల నరేందర్‌రెడ్డిపై అక్రమ కేసు కుట్ర
ఫామ్‌హౌస్ గోడదూకి వెళ్లి గంజాయి పెట్టి కేసు నమోదుకు పన్నాగం
సీసీటీవీ ఫుటేజీతో బట్టబయలు


