పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

Oct 24 2026 12:04 AM | Updated on Oct 24 2026 12:04 AM

నెల్లూరు రూరల్‌: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గానూ 4277 మంది పోలింగ్‌ సిబ్బందిని కేటాయించేలా ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కలెక్టరేట్లో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రక్రియను చేపట్టారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు రూరల్‌, అర్బన్‌ ప్రాంతాల్లోని 594 పోలింగ్‌ కేంద్రాల్లో ఒక్కో సెంటర్‌కు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు ఇతర అధికారుల చొప్పున సిబ్బందిని కేటాయించారు. విధుల్లో ఎలాంటి లోపాలకు తావులేకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. డీఆర్వో విజయకుమార్‌, చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి లక్ష్మీనరసింహ, సమాచార శాఖ డీడీ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

నెల్లూరు రూరల్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశమున్న తరుణంలో మత్స్యకారులు, ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని, భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని చెప్పారు. సముద్రంలో ఇప్పటికే ఉన్న బోట్లు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు.

చెలరేగిన టీడీపీ దండు

చిల్లకూరు: నామినేషన్ల పర్వం చివరి రోజునా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను టీడీపీ వర్గీయులు ఇబ్బందులకు గురిచేశారు. చిల్లకూరులో నామినేషన్‌ కేంద్రానికి చేరుకునే మార్గంలో రెండు వైపులా సుమారు 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలను పోలీసులు విధించారు. దీంతో తీర ప్రాంతంలోని గ్రామాల నుంచి వచ్చే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గూడూరు మండలం పోటుపాళెం కూడలి నుంచి రావాల్సి వచ్చింది. అయితే అక్కడ కాపు కాచిన టీడీపీ వర్గీయులు నామినేషన్‌ వేసేందుకు వచ్చేవారిని అడ్డుకొని పత్రాలను లాక్కునేందుకు యత్నించారు. బల్లవోలు సెగ్మెంట్‌లో నామినేషన్‌ వేసేందుకొస్తున్న లలితారాణిని అక్కడి నేతలు అడ్డుకొని ఇబ్బందులకు గురిచేశారు. ఎట్టకేలకు మధ్యా హ్నం నాలుగు గంటల ప్రాంతంలో కేంద్రానికి చేరుకొని ఆమె దాఖలు చేశారు.

అంతా ఇష్టారాజ్యం..

● నామినేషన్‌ కేంద్రానికి ఫీల్డ్‌ అసిస్టెంట్‌

● ఎంపీటీసీ అభ్యర్థితో

కలిసి రావడంపై విమర్శలు

వరికుంటపాడు: మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘించారు. తిమ్మారెడ్డిపల్లికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మల్లికార్జున రాజకీయ నేతలతో కలిసి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి వెంట నామినేషన్‌ కేంద్రానికి వచ్చారు. వాస్తవానికి రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వోద్యోగులు దూరంగా ఉండాలనే నిబంధనను తుంగలో తొక్కారు.

ఘర్షణకు ఎన్నికలతో

సంబంధం లేదంట..!

● తేల్చిన డీఎస్పీ

కావలి: పార్టీ మార్పు తరుణంలో తుమ్మలపెంట బస్టాండ్‌లో తండ్రీకొడుకుల మధ్య గురువారం రాత్రి జరిగిన ఘర్షణ ఎన్నికలతో సంబంధంలేదని కావలి డీఎస్పీ రమణకుమార్‌ తేల్చారు. ఈ మేరకు పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. బోగోలు మండలం కోళ్లదిన్నెలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వెంకటరమణయ్య.. టీడీపీ నేత వంటేరు ప్రసన్నతో కలిసి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సమక్షంలో చేరారన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రామ నేత అట్ల శివరాజ్‌రెడ్డి.. వెంకటరమణయ్యతో చర్చించి తిరిగి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారని వివరించారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నేతలు కావలికి వస్తున్న క్రమంలో తుమ్మలపెంట బస్టాండ్‌ వద్ద తండ్రీకొడుకుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారి తీసిందని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement