ఆగని వాన | - | Sakshi
Sakshi News home page

ఆగని వాన

Oct 24 2026 12:04 AM | Updated on Oct 24 2026 12:04 AM

నెల్లూరు(అర్బన్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఈశాన్య రుతుపవనాలు తోడవడంతో జిల్లాలో వర్షాలు పుంజుకున్నాయి. ఐదురోజులుగా మోస్తరుగా కురుస్తున్న వానలు ప్రస్తుతం భారీగా మారాయి. దీంతో క్రమేపీ చెరువుల్లోకి నీరు చేరుతోంది. వానాకాలంలోనూ వర్షాలు లేక ఎండలు మండిపోవడంతో పంటలు పండుతాయో లేదోనని ఆందోళన చెందిన రైతన్నల్లో తాజా పరిస్థితులు ఆశలు రేకెత్తిస్తున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. మరో కొద్ది రోజులపాటు ఇదే విధంగా వానలు పడితే మొదటి వరి పంటకు నీటి ఇబ్బందులు ఉండవని రైతులు ఆశిస్తున్నారు. మామిడి, బత్తాయి, నిమ్మ తదితర తోటలకు తాజా వర్షాలు ఊరటనిస్తున్నాయి. పశుగ్రాసం కొరత కూడా తగ్గే అవకాశం ఉంది.

వర్షపాతం వివరాలిలా..

శుక్రవారం జిల్లాలో భారీ వర్షం కురిసింది. సరాసరి వర్షపాతం 34.1 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా అనుమసముద్రంపేటలో 90.2 మి.మీ. వర్షం కురవగా, అత్యల్పంగా సీతారామపురంలో 4.2 మి.మీ. నమోదైంది. ఇక సైదాపురంలో 84.2, నెల్లూరు అర్బన్‌లో 75.2, చేజర్లలో 70.2, కలువాయిలో 60.0, నెల్లూరు రూరల్‌లో 58.6, మనుబోలులో 54.4, రాపూరులో 52.8, కోటలో 45.2, పొదలకూరులో 45.2, తోటపల్లిగూడూరులో 43.8, కొడవలూరులో 42.4, విడవలూరులో 38.6, ఆత్మకూరులో 36.2, వింజమూరులో 33.4, బుచ్చిరెడ్డిపాళెంలో 32.6, వెంకటాచలంలో 31.4, ఇందుకూరుపేటలో 26.8, కోవూరులో 26.0, చిల్లకూరులో 25.6, సంగంలో 25.4, అనంతసాగరంలో 25.0, కలిగిరిలో 24.8, జలదంకిలో 24.8, దగదర్తిలో 20.6, ముత్తుకూరులో 19.6, గూడూరులో 18.4, కావలిలో 16.2, అల్లూరులో 15.4, ఉదయగిరిలో 14.2, వరికుంటపాడులో 11.8, దుత్తలూరులో 11.2, మర్రిపాడులో 9.2, కొండాపురంలో 8.4, బోగోలులో 5.0, సీతారామపురంలో 4.2. మి.మీ. వాన కురిసింది.

పొంగి ప్రవహిస్తూ..

పలు మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకల్లోకి వరద నీరు చేరుతోంది. గూడూరు ప్రాంతంలోని కై వల్యానది పొంగి ప్రవహిస్తోంది. నిండలి గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జిపైకి సుమారు అడుగు మేర నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గూడూరు సమీపంలోని పంబలేరులోనూ నీటి ఉధృతి పెరిగింది. కోట ప్రాంతంలోని మామిడి కాలువ నిండుగా ప్రవహిస్తుండగాా, మలిదేవి డ్రెయిన్‌లోకి నీరు చేరుతోంది.

తీరం అల్లకల్లోలం

అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రపు అలలు మూడు నుంచి ఐదు మీటర్ల మేర తీరంవైపు చొచ్చుకొచ్చాయి. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తీరం వెంబడి ఈదురుగాలుల తీవ్రత పెరిగింది.

ఇంకా లోటు

జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోంది. ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, మర్రిపాడు, కొండాపురం, కావలి, జలదంకి, అనంతసాగరం తదితర మండలాల్లో వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉన్నాయి. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 581.6 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, 374.4 మి.మీ. మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ లోటు 35.6 శాతంగా ఉంది. ప్రస్తుత వానలు ఈ లోటును ఎంతవరకు భర్తీ చేస్తాయో చూడాలి.

జిల్లాలో భారీ వర్షం

చెరువుల్లోకి చేరుతున్న నీరు

సరాసరి వర్షపాతం 34.1 మి.మీ.

అత్యధికంగా అనుమసముద్రంపేటలో 90.2 మి.మీ.

పలుచోట్ల వాగులు, వంకల్లోకి వరద నీరు

ఇంకా 35.6 శాతం వర్షపాతం లోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement