మామూళ్లు పుచ్చుకో.. ఓవర్‌లోడ్‌తో తిప్పుకో | - | Sakshi
Sakshi News home page

మామూళ్లు పుచ్చుకో.. ఓవర్‌లోడ్‌తో తిప్పుకో

Oct 19 2026 12:14 AM | Updated on Oct 19 2026 12:14 AM

ఓ ఉదాహరణ

నెల్లూరు(టౌన్‌): ప్రకాశం జిల్లా చీమకుర్తి, బల్లికురవ, గుంటూరు జిల్లా గురిజేపల్లి, వరంగల్‌, కరీంనగర్‌, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుతోపాటు తమిళనాడు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు అధిక సంఖ్యలో గ్రానైట్‌ ముడిరాయిని రవాణా చేస్తుంటారు. ఇంకా గ్రానైట్‌ శ్లాబులు, కంకరను కూడా తరలిస్తుంటారు. ఈ సరుకులను అధిక లోడుతోనే వాహనాల్లో రవాణా చేస్తుంటారు. దీంతో ఆ శాఖ అధికారులు నిత్యం జాతీయ రహదారులపైనే తనిఖీలు నిర్వహిస్తారు. కొంతమంది నెలవారీ మామూళ్లు ఇచ్చి వాహనాలను తిప్పుకుంటుండగా, మరికొందరు తనిఖీల్లో పట్టుబడిన సమయంలో ఓవర్‌లోడ్‌ను బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఇచ్చి వెళ్తున్న సంఘటనలు ఉంటున్నాయి. ఈ రీతిలో రోజూ రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

సరిహద్దు వివాదం

నెల్లూరు, గూడూరు రవాణా అధికారుల మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. కృష్ణపట్నం పోర్టు రోడ్డు వెంకటాచలం మండల పరిధిలో ఉందని నెల్లూరు అధికారులు చెబుతుండగా, మనుబోలు మండల పరిధిలో కొంత రోడ్డు ఉందని, అందుకే తాము తనిఖీలు చేస్తున్నామని గూడూరు అధికారులు చెబుతున్నారు. కృష్ణపట్నం పోర్టుకు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటం, అధిక సంఖ్యలో ఓవర్‌లోడ్‌ వాహనాలు తిరుగుతుండటంతో రవాణా అధికారులందరి దృష్టి ఆ రోడ్డుపైనే ఉంది. మనుబోలు మండల పరిధిలో కృష్ణపట్నం రోడ్డు అర కిలోమీటరు లోపే ఉంటుందని చెబుతున్నారు. అంతమాత్రాన గూడూరు నుంచి వచ్చి ఇక్కడ తనిఖీలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనుబోలు, గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై తనిఖీలు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, కృష్ణపట్నం పోర్టుకు వచ్చే వాహనాల నుంచి అధిక మొత్తంలో అనధికారిక వసూళ్లు చేసుకోవాలన్న ఆలోచనతో గూడూరు రవాణా అధికారులు నిత్యం ఇక్కడే తనిఖీలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. వాస్తవానికి నెల్లూరు రవాణా అధికారులతోపాటు స్క్వాడ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఈ ప్రాంతంలో ఎక్కువగా తనిఖీలు చేస్తుంటారు. వీరిని కాదని, కొద్దిగా రోడ్డు తమ పరిధిలో ఉందన్న కారణంతో గూడూరు నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు చేయడం వివాదాస్పదంగా మారింది. గూడూరుకు చెందిన ఓ ఏఎంవీఐ నిత్యం ఇక్కడే తనిఖీలు చేస్తున్నారని లారీల యజమానులు చెబుతున్నారు.

మామూళ్ల కోసం మధ్యవర్తులు

అధికలోడుతో వస్తున్న వాహనాల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసేందుకు కొందరు రవాణా అధికారులు మధ్యవర్తులను నియమించుకున్నట్లు తెలిసింది. ఒక్కో వాహనం నుంచి ఒక్కో అధికారికి రూ.1,200 చొప్పున మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొందరు అధికారులు తమ వద్ద పనిచేసే డ్రైవర్‌ లేదా హోంగార్డుతో మామూళ్లు వసూలు చేయించుకుంటున్నట్లు తెలిసింది. నెలవారీ మామూళ్లు చెల్లించని వాహనాల నుంచి అధిక లోడును బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు తెలిసిన వారి ఫోన్‌పే లేదా గూగుల్‌ పే ఖాతాలకు డబ్బులు పంపిస్తున్నట్లు చెబుతున్నారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే కేసు నమోదు చేసి వెళ్లిపోతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కావలి టోల్‌గేట్‌ వద్ద ఏసీబీ అధికారులు ఎంవీఐ గోపీనాయక్‌ వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించి, రూ.1.50 లక్షల వరకు అనధికారిక మొత్తాన్ని గుర్తించి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో నిత్యం అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్న రవాణా అధికారులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని పలువురు వాహనాల యజమానులు కోరుతున్నారు. ఈ విషయంపై డీటీసీ చందర్‌కు ఫోన్‌ చేయగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

ఓవర్‌లోడ్‌తో ఉన్న గ్రానైట్‌ లారీ (ఫైల్‌)

రవాణా అధికారుల

తనిఖీల్లో చేతివాటం

పోర్టు రోడ్డు వద్దే గూడూరు

రవాణా అధికారుల తిష్ట

అధికలోడు వాహనాలపైనే

దృష్టి కేంద్రీకరణ

లైన్‌ మామూళ్లున్న వాహనాలను

వదిలివేస్తున్న వైనం

లేని వాటినుంచి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వసూళ్లు

డబ్బులు ఇవ్వకుంటే కేసు రాశారు

చీమకుర్తి నుంచి గ్రానైట్‌తో వస్తున్న మా లారీని గూడూరుకు చెందిన ఏఎంవీఐ గత శనివారం ఉదయం కృష్ణపట్నం పోర్టు రోడ్డు వద్ద ఆపారు. ఓవర్‌లోడ్‌ ఉందని, కాబట్టి రూ.10 వేలు ఇవ్వాలని అడిగారు. నెలరోజుల క్రితమే మీరే కేసు రాశారని, ఇప్పుడు డబ్బులు ఇవ్వలేమని చెప్పడంతో మనుబోలు కాటా దగ్గరకు లారీని తీసుకురావాలని చెప్పారు. కృష్ణపట్నం రోడ్డులోనే కాటా ఉందని, అక్కడకు తీసుకువస్తామని చెప్పినా వినకుండా పత్రాలు తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని డీటీసీ, గూడూరు ఆర్టీఓ దృష్టికి తీసుకెళ్లా. అదేరోజు రాత్రి వచ్చి కేసు రాశారు. మా లారీని ఆపిన సమయంలోనే మరో మూడు గ్రానైట్‌ లారీలను ఆపి, లైన్‌ ఉందని చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఓ లారీ విషయంలో ఎమ్మెల్యే సిఫార్సు ఉందని చెప్పడంతో విచారించి పంపించారు. అదేరోజు రాత్రి చీమకుర్తి నుంచి వస్తున్న మరో గ్రానైట్‌ లారీలో ఓవర్‌లోడ్‌ ఉందని చెప్పి, మనుబోలు వద్ద రూ.10 వేలు తీసుకుని పంపించారు.

– మురళీకృష్ణ, లారీ యజమాని

ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి ఏపీ 39 టీయూ 7802 నంబర్‌ గల గ్రానైట్‌ లారీ అధిక లోడుతో కృష్ణపట్నం పోర్టుకు వెళ్తుండగా శనివారం ఉదయం గూడూరుకు చెందిన ఓ ఏఎంవీఐ ఆ లారీని ఆపి తనిఖీ చేశారు. ఓవర్‌లోడ్‌ ఉండటంతో సంబంధిత పత్రాలను తీసుకుని మనుబోలు సమీపంలోని వేబ్రిడ్జి వద్దకు రావాలని సదరు అధికారి డ్రైవర్‌ను ఆదేశించారు. పోర్టు సమీపంలోనే వేబ్రిడ్జి ఉందని, అక్కడే కాటా వేయాలని డ్రైవర్‌ కోరాడు. మనుబోలు వస్తేనే కేసు రాసి పత్రాలు ఇస్తామని, లేదంటే ఎన్ని రోజులైనా అక్కడే ఉండాలని అధికారి సూచించారు. దీంతో చేసేదేమీ లేక లారీ యజమాని డీటీసీ, గూడూరు ఆర్టీఓ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. దీంతో లారీని అక్కడే ఉంచారు. ఆ తర్వాత అధికారులు చెప్పారో, లేక మనసు మార్చుకున్నారో తెలియదు గానీ, అదేరోజు రాత్రి వచ్చి రూ.90 వేల జరిమానాతో కేసు నమోదు చేసి పత్రాలను ఇచ్చి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement