● బీభత్సంగా ఎగసిపడుతున్న అలలు
● మూడు రోజులుగా భారీ వర్షాలు
● తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం
వాకాడు: మూడు రోజులుగా మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సముద్రతీరం భయానకంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో తీరం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. దీంతో పర్యాటకులు, స్థానిక మత్స్యకారులు సముద్రతీరం వైపు వెళ్లేందుకు సాహసించడం లేదు. సముద్రంలో అలల ఉధృతి పెరగడంతో మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేట సామగ్రిని అలల తాకిడికి దూరంగా భద్రపరుచుకుంటున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వేటకు వెళ్లే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తీరంలో నెలకొన్న పరిస్థితులు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలల ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో తీరం వైపు వెళ్లవద్దని, వేటకు వెళ్లే విషయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారులు సూచించే ముందస్తు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని మైరెన్, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు తీర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


