● వైఎస్సార్సీపీ శ్రేణులకు
కాకాణి గోవర్ధన్డ్డి పిలుపు
నెల్లూరురూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి విజయానికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ముత్తుకూరు, వెంకటాచలం, తోటపల్లిగూడూరు మండల నాయకులతో వేర్వేరుగా సమావేశమై అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రాజకీయ పరిస్థితులను అంచనా వేసి, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఎన్నికల బాధ్యతలను ఇప్పటి నుంచే చేపట్టి, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని, పార్టీ పట్ల విశ్వాసం పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఓటరును కలిసి, పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలను వివరించాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రతి అంశంలోనూ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఎన్నికల సమయంలో అధికారులు నిబంధనలకు అనుగుణంగా నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలని కాకాణి కోరారు. అధికార పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తే సహించబోమని, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభ్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేస్తే చట్టపరంగా పోరాడతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి నాయకులు, కార్యకర్తలు కషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


