● వైఎస్సార్సీపీ అభ్యర్థులను
గెలిపించండి
● మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు: ‘ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కన్వీనర్ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణాధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, చైర్పర్సన్ అభ్యర్థి ఇందుమతి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి అభ్యర్థికి దొరక్క రెండురోజులపాటు పలు పేర్లు తెరపైకి తెచ్చారన్నారు. తొలుత బీసీ జనరల్‌కు కేటాయించి వైఎస్సార్సీపీకి చెందిన డాక్టర్‌ను చేరాలని అడిగి భంగపడ్డారని, అది జరగకపోవడంతో తమ అధికారంతో పదవిని ఓసీ మహిళకు కేటాయించారన్నారు. అయినా వారికి అభ్యర్థి దొరక్క తమ పార్టీకి చెందిన కుటుంబంలో లొల్లిపెట్టి ఆశలు చూపి ఆ ఇంటి మహిళలను ప్రకటించుకోవాల్సిన పరిస్థితి మంత్రి ఆనంకు ఏర్పడిందన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న అల్లారెడ్డి కుటుంబానికి చెందిన ఇందుమతిని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి బలపరచడంతో అభ్యర్థిగా ప్రకటించామన్నారు. కాగా ఆనం, ఆయన అనుచరుల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
టీడీపీ నేతల భూఆక్రమణలు
మంత్రి ఆనం ప్రమేయంతో పట్టణంలోని ఎస్‌ఆర్‌జేడీ కళాశాల భూమిని సొంతం చేసుకొని 4 లక్షల క్యూబిక్ మీటర్ల చెరువుమట్టిని ఆ భూమికి తరలించారని విక్రమ్‌రెడ్డి అన్నారు. పెన్నానది ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించి అక్రమంగా సంపాదించారన్నారు. అదే క్రమంలో వందలాది ఎకరాల భూఆక్రమణలు టీడీపీ నాయకులు చేశారన్నారు. మొత్తం నియోజకవర్గంలో రూ.350 కోట్ల అక్రమ సంపాదన ఈ రెండున్నరేళ్లలో మంత్రి సారఽథ్యంలో సాగిందన్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి తీర్పు కోరుతామన్నారు. సోమశిల ప్రాజెక్ట్ ఆప్రాన్ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించి ఆరునెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించి రెండేళ్లయినా ఆ పని అతీగతీ లేకుండా అక్కడే ఉందన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, దీనికి నిదర్శనం పుంగనూరు, రాయచోటి, పులివెందులలో జరిగిన సంఘటనలే అన్నారు. సమావేశంలో పార్టీ ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకుడు కూనం సుధాకర్‌రెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు నందా ఓబులేసు, గొర్రిపర్తి నాగభూషణమ్మ, ఎండీ ముజీబ్, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, ఐ.సురేంద్ర రెడ్డి, బాలఅంకయ్య, సీహెచ్ హేమ తదితరులు పాల్గొన్నారు.


