ఉదయగిరి: స్థానిక రంగనాయకస్వామి దేవాలయం సమీపంలోని బీసీ బాలుర వసతి గృహంలో సామగ్రి చోరీ జరిగిన విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు వసతి గృహంలోని కిటికీలు, తలుపులు, ద్వారబంధాలను పగులగొట్టి సామగ్రిని చోరీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. విద్యార్థులు లేకపోవడంతో మూడేళ్ల క్రితం ఈ వసతి గృహాన్ని మూసివేశారు. అప్పటి నుంచి పర్యవేక్షణ లేకపోవడంతో భవనం మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు వసతి గృహంలోని సామగ్రిని చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు.
25 బస్తాల బియ్యం అపహరణ
● సీసీ కెమెరాల ధ్వంసం
బుచ్చిరెడ్డిపాళెం: పట్టణంలో దొంగలు వినూత్న పద్ధతిలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని శ్రీనివాస రైస్ మిల్లును లక్ష్యంగా చేసుకున్న దుండగులు అర్ధరాత్రి వేళ తాళాలు పగలగొట్టి 25 బస్తాల బియ్యాన్ని అపహరించారు. చోరీని గుర్తించకుండా ఉండేందుకు మిల్లులోని సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.50 వేల విలువైన బియ్యం చోరీకి గురైనట్లు మిల్లు యజమాని కాకరిపర్తి ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ప్రభాకర్ రోజూ రాత్రి మిల్లును మూసివేసి ఇంటికి వెళ్తుంటారు. రోజూ సీసీ కెమెరాలను ఫోన్ ద్వారా పరిశీలించే అలవాటులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున చూడగా అవి ధ్వంసమైనట్లు గుర్తించారు. దీంతో వెంటనే మిల్లు వద్దకు చేరుకుని పరిశీలించగా తాళాలు పగులగొట్టి ఉండటం, బియ్యం బస్తాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చోరీకి పాల్పడిన వారెవరు?, ఘటనలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
నిమ్మధరలు(కిలో)
పెద్దవి: రూ.125 సన్నవి: రూ.70
పండ్లు: రూ.40


