నెల్లూరు(పొగతోట): ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలను అప్డేట్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల ఫెడరేషన్ బాధ్యులు సురేంద్రరెడ్డి, గురవయ్య కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతన సీఈఓ మధుసూదన్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. 2021 నుంచి జెడ్పీ పీఎఫ్ ఖాతాలను నవీకరించి ఆన్లైన్లో పొందుపరచాలని కోరారు. కార్యక్రమంలో పిచ్చిబాబు, మోహన్‌రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.
వ్యాన్ బోల్తా
● ఏడుగురికి గాయాలు
వాకాడు: మండల పరిధిలోని మరియమ్మ మందిరం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. బుర్లవారిపాళెం గ్రామానికి చెందిన పలువురు ట్రక్కు వ్యాన్‌లో చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో మరియమ్మ మందిరం వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
పశువుల కాపరిపై పిడుగు
● గేదెలను మేపేందుకు వెళ్లి
విగతజీవిగా తిరిగొచ్చిన రైతు
సైదాపురం: బతుకుదెరువు కోసం గేదెలను మేపుతూ కుటుంబాన్ని పోషించుకునే ఆ రైతు.. రోజూలాగే పశువులను మేపేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు అతని మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది. పిడుగుపాటుకు గురై కుటుంబ పెద్ద మృతి చెందడంతో గిద్దలూరులో విషాదం నెలకొంది. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని గిద్దలూరు గ్రామానికి చెందిన చిట్టమూరి బలరామిరెడ్డి (55) వ్యవసాయంతోపాటు గేదెలను మేపుతూ జీవనం సాగించేవారు. అతడికి భార్య ప్రమీల, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లాడు. అదేరోజు మధ్యాహ్నం భారీ వర్షం కురుస్తుండగా పిడుగు పడింది. ఆ సమయంలో అక్కడ పశువులను మేపుతున్న ఐదుగురిలో నలుగురు పరిగెత్తి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. గొడుగు పట్టుకుని అక్కడే ఉన్న బలరామిరెడ్డి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్యాపిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
జిల్లాలో మోస్తరు వర్షాలు
● తగ్గిన ఉష్ణోగ్రతలు
● పిడుగులు పడే అవకాశం
● అప్రమత్తంగా ఉండాలని సూచన
నెల్లూరు(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో మూడు రోజులుగా పలుచోట్ల మోస్తరు వర్షాలు, చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవిని తలపించేలా నమోదైన ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 30 డిగ్రీల సెల్సియస్‌కు దిగివచ్చాయి. శనివారం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పశుగ్రాసం కొరత కొంతవరకు తగ్గుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న నిమ్మ, బత్తాయి వంటి తోటలకు చిరుజల్లులు కొంత ఊరటనిచ్చాయని పేర్కొంటున్నారు. అయితే, భారీ వర్షాలు కురవకపోవడంతో పంటలకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదని, విస్తారంగా వర్షాలు కురవాలని రైతులు ఆశిస్తున్నారు.


