● విద్యుదాఘాతానికి గురై
ప్రైవేట్ లైన్మెన్ మృతి
చిట్టమూరు: విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా షాక్కు గురై ఓ ప్రైవేట్ లైన్మెన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భార్య, ఇద్దరు చిన్నారులకు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని గునపాడులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గంగపట్నం మహేష్ (33) ప్రైవేట్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గ్రామంలో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో స్థానికులు రెగ్యులర్ లైన్మెన్కు సమాచారం అందించారు. దీంతో ఆయన తన కింద పనిచేస్తున్న మహేష్కు విషయం తెలియజేసి స్తంభంపై మరమ్మతులు చేయాలన్నాడు. సబ్స్టేషన్ నుంచి సరఫరా నిలిపివేశారని చెప్పడంతో మహేష్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేపట్టాడు. అయితే అటుగా మెట్టు గ్రామానికి వెళ్లే లైన్లో సరఫరా ఉండటంతో అతను విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై చిట్టమూరు ఎస్సై కె.నాగరాజు కేసు నమోదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ట్రాన్స్కో ఏఈ వెల్లడించారు.


