స్థానిక ఎన్నికలకు నోడల్‌ అధికారుల నియామకం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు నోడల్‌ అధికారుల నియామకం

Oct 17 2026 12:04 AM | Updated on Oct 17 2026 12:04 AM

నెల్లూరురూరల్‌: జిల్లాలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా నోడల్‌ అధికారులను నియమించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు, శాంతిభద్రతలు, భద్రతా ప్రణాళికకు డీఆర్వో ఎన్‌.విజయకుమార్‌, అదనపు ఎస్పీ సౌజన్యను నియమించారు. సిబ్బంది నిర్వహణ, రాండమైజేషన్‌ బాధ్యతలను డీఆర్వో విజయకుమార్‌, డిప్యూటీ కలెక్టర్‌ జి.కేశవర్ధన్‌రెడ్డి, డీఈఓ బాలాజీరావు తదితరులకు అప్పగించారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, పంపిణీ బాధ్యతలను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వంశీకృష్ణ, రవాణా నిర్వహణను డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ బి.చందర్‌కు, ఎన్నికల సిబ్బంది శిక్షణను జి.కేశవర్ధన్‌రెడ్డికి కేటాయించారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు జిల్లా ఆడిట్‌ అధికారి డి.సింహాద్రి, డీసీఓ గుర్రప్పను నియమించారు. కంప్యూటరీకరణకు ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ సీహెచ్‌ శ్రీరాములు, వెబ్‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీకి ఆర్‌ఐఓ టి.వరప్రసాద్‌రావు, పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓటర్ల బాధ్యతలను డీఆర్డీఏ పీడీ వి.నాగరాజుకుమారి చూస్తారు. పోలింగ్‌ కేంద్రాల నిర్వహణకు పీఆర్‌ ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విజయభాస్కర్‌, బ్యాలెట్‌ బాక్సుల నిర్వహణకు మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, ఓటర్ల జాబితాల బాధ్యతలకు డిప్యూటీ కలెక్టర్‌ సోమ్లా నాయక్‌ను నియమించారు.

మీడియా, ఫిర్యాదులపై ప్రత్యేక పర్యవేక్షణ

మీడియా, సమాచార నిర్వహణతోపాటు ఎన్నికల వార్తలు, పత్రికా కథనాల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా పౌరసంబంధాల అధికారి పి.వేణుగోపాల్‌ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పి.వెంకటలక్ష్మమ్మకు అప్పగించారు. ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి టి.లక్ష్మీనరసింహులును నియమించారు. పరిశీలకుల పర్యటనలు, వారికి అవసరమైన సమాచారం అందించడం, మైక్రో అబ్జర్వర్ల నియామకం, శిక్షణ తదితర అంశాలకు కూడా ప్రత్యేక అధికారులను నియమించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. నోడల్‌ అధికారులకు అవసరమైన సహాయక సిబ్బందిని కేటాయించాలని సంబంధిత మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement