● పార్టీ శ్రేణులకు
కాకాణి గోవర్ధన్రెడ్డి దిశానిర్దేశం
నెల్లూరురూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పొదలకూరు మండల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలు, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై దిశానిర్దేశం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో సాధించే విజయాలు 2029 సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి పునాది కావాలన్నారు. వైఎస్ జగనన్మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు అవసరమైన ఫారాలు, ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు, నామినేషన్ ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులకు అవసరమైన కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలను సంబంధిత అధికారులు సకాలంలో అందజేయాలని కోరారు. ధ్రువపత్రాల జారీలో జాప్యం జరుగుతోందన్న ఫిర్యాదులపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పి ంచాలని, పత్రాల జారీలో నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు పరిశీలన జరపాలన్నారు. పొదలకూరు మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని కాకాణి పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.


