నెల్లూరు (టౌన్): ిసంహపురికే వీఎస్‌యూ తలమానికమని వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు సాక్షితో శనివారం ఆయన మాట్లాడారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే కోర్సులు వర్సిటీలో ఉన్నాయని చెప్పారు. కావలి పీజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఫార్మసీ కళాశాలలో 60 సీట్లున్నాయని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించామని వెల్లడించారు. కంప్యూటర్ సైన్స్, ఏఐఎమ్మెల్, ఏఐడీఎస్, ఈసీఈ కోర్సుల్లో 240 మందికి ప్రవేశముందని చెప్పారు. ఫార్మసీ, ఇంజినీరింగ్ కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యముందని తెలిపారు. పేద విద్యార్థులు జీరో ఫీజుతో నాణ్యమైన విద్యతో కోర్సును పూర్తి చేయొచ్చన్నారు. పీఎం ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ ద్వారా రూ.20 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ మొత్తంతో బాలికల హాస్టల్, ఆన్‌లైన్ టెస్ట్ సెంటర్, మినీ ఆడిటోరియం, పరికరాలు తదితరాలను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. వర్సిటీలోని మైరెన్ బయాలజీకి రూ.ఏడు కోట్లను సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేసిందని వివరించారు. మత్స్య సంపదపై పరిశోధన ఉంటుందని, ఈ నిధులతో ల్యాబ్‌ను నిర్మించనున్నామని వెల్లడించారు. మైరెన్ బయాలజీలో 15 మంది విద్యార్థులకు నెలకు రూ.పది వేల చొప్పున కోర్సు పూర్తయ్యేంత వరకు ఇవ్వనున్నామన్నారు. క్వాలిఫైడ్ అధ్యాపకులతో విద్యను బోధిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నామని, టెస్ట్‌ను నిర్వహించి ఎంపిక చేయనున్నామన్నారు. దేశంలోనే ఉత్తమ వర్సిటీగా వీఎస్‌యూను భవిష్యత్తులో తీర్చిదిద్దనున్నామని ప్రకటించారు.
జెడ్పీకి పాఠశాలల ఉద్యోగులు
నెల్లూరు(పొగతోట): జెడ్పీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఏడుగుర్ని.. తిరుపతి జెడ్పీకి 21 మంది ఉద్యోగులను ఇటీవల బదిలీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉండటంతో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను జెడ్పీకి డిప్యుటేషన్‌పై బదిలీ చేయనున్నారని సమాచారం.
శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 68,187 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 23,923 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.55 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


