ప్రభుత్వ సాయమేదీ..? | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సాయమేదీ..?

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేక.. వర్షాలు పడక వ్యవసాయ పనులు సాగడం లేదు. కొనుగోలు చేసి తీసుకొచ్చిన మినుములను పొలాల్లో వెదజల్లే అవకాశం లేకుండాపోయింది. విత్తనాలను గత ప్రభుత్వ హయాంలో రాయితీపై అందించేవారు. అయితే ప్రస్తుతం ఇదేమీ లేదు. అధిక ధరలకు బయట వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సి వస్తోంది.

– దగ్గుమాటి శ్రీనివాసులురెడ్డి,

చంద్రారెడ్డిపాళెం, కలిగిరి మండలం

ఖరీఫ్‌లో వరి సాగు కోసం ఐదెకరాలను కౌలుకు తీసుకున్నా. చివరి దశలో తెలుగుగంగ నీటిని కాలువల వదలితే పంట పండుతుందని ఆశపడ్డా. అయితే చుక్క నీటిని సైతం అధికారులు విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయా.

– వెంకటేశ్వర్లు, కౌలు రైతు, చిట్టమూరు మండలం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా రైతాంగంపై ప్రకృతిని మించి.. సర్కారు పగబట్టింది. వ్యవసాయ ఆధారిత జిల్లాపై ‘ఎల్లో’ నినో కరువు పంజా విసిరింది. జిల్లాలో 36కు 35 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నెలకొంది. ఇది ప్రకృతి సృష్టించిన విపత్తు అయితే.. కరువు మండలాల జాబితా నుంచి పూర్తిగా జిల్లాను తొలగించడం ద్వారా చంద్రబాబు సర్కారు ‘మహావిపత్తు’ను సృష్టించింది. రాష్ట్రంలో 388 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ జాబితా ప్రకటించింది. వాస్తవానికి జిల్లాలో 20 మండలాల్లో 59.9 శాతం వరకు లోటు వర్షపాతం నమోదు కాగా.. మరో 13 మండలాల్లో 19 శాతం లోటు వర్షాభావం నెలకొంది. జిల్లాలోని 35 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతుంటే.. అధికారులు మాత్రం 31 మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. వరికుంటపాడులో ఏకంగా 61.6 శాతం, అనంతసాగరంలో 68.4 శాతం లోటు వర్షపాతం నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం కనీసం ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో పెట్టకపోవడం దారుణమని రైతాంగం మండిపడుతోంది.

సింహపురిలో దుర్భిక్ష ఛాయలు

జిల్లాలో 78 టీఎంసీల సామర్థ్యమున్న సోమశిల, 69 టీఎంసీల కండలేరు వంటి భారీ జలనిధులతోపాటు మరో 50 నుంచి 60 టీఎంసీలు నిల్వ సామర్థ్యం కలిగిన పలు చెరువులు, జలవనరులు ఉన్నాయి. జిల్లాలో వరుణుడు పగబట్టడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు వచ్చినా.. చినుకు జాడ కరువైంది. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో శ్రీశైలం జలాశయంలో సమృద్ధిగా ఉన్న నీటిని తరలించి.. కరువును తరిమి కొట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జలాశయాలు, జలవనరులు బావురుమంటున్నాయి. ఇది ‘ఎల్లో’ నినో సృష్టించిన ‘మహాదుర్భిక్షం’గా చెప్పొచ్చు.

రైతాంగంపై ఎందుకీ నిర్లక్ష్యం

జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి వనరులను అంచనా వేసి 4 లక్షల ఎకరాలకుపైగా వరి సాగుకు నీరందిస్తామని ఐఏబీ సమీక్షలో అధికారులు, పాలకులు బాహాటంగా ప్రకటించారు. అయితే ఆదిలోనే నీటి విడుదలలో జాప్యం కారణంగా చివరి ఆయకట్టు ప్రాంతాల్లో నారుమడులు దెబ్బతినడంతో సాగునీటిపై ఆశలు వదిలేసుకున్న రైతులు సాగుకు దూరంగా మిగిలిపోయారు. దాదాపు 3.70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే.. చివరకు 1.80 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించి చేతులు దులుపుకొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 22 నాటికి సోమశిలలో 58 టీఎంసీలు, కండలేరులో 35 టీఎంసీలు కలిపి ఏకంగా 93 టీఎంసీల మేర నీరు అందుబాటులో ఉంది. అయితే సరైన నిర్వహణ, కార్యాచరణ లేకపోవడంతో సుమారు 64 టీఎంసీల నీటిని వృథా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

క్రాప్‌ ఇన్సురెన్స్‌ రాదు..

రుణాల రీ షెడ్యూల్‌ జరగదు

జిల్లాలో కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 2500 మంది రైతులు క్రాప్‌ ఇన్సురెన్స్‌ చెల్లించారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో నెల్లూరు జిల్లాను పూర్తిగా పక్కనబెట్టేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయా రు. అదే కరువు మండలాలు ప్రకటించి ఉంటే.. కనీసం ఆ కొందరికై నా నష్టపరిహారం లభించేది. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను రీషెడ్యూల్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ అవకాశాలను రైతులు కోల్పోయారు. కరువు జాబితాలో జిల్లా ఉంటే.. రైతులకు సబ్సిడీపై విత్తనాల సరఫరాకు ఎగనామం పెట్టడానికే కూటమి కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

కరువు జాబితాలో నెల్లూరు అవుట్‌

జిల్లాలో 36కు 35 మండలాల్లో

తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు

31 మండలాల్లో కరువు ఉన్నట్లు జాబితా పంపించిన వ్యవసాయ శాఖ

జిల్లాలో 3.70 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సీజన్లో వరి సాగు

కొంత వరకూ పంటలు మొదటి దశలోనే ఎండిపోయిన వైనం

కరువు ప్రకటించకపోవడంతో క్రాప్‌ ఇన్సురెన్స్‌ చెల్లించిన

రైతులకు తీవ్ర నష్టం

రుణాల రీ షెడ్యూల్‌కు

అవకాశం లేని పరిస్థితి

నేటికీ అందని నష్టపరిహారం

నష్టపోయా..

నీటిని విడుదల చేయలేదు

వరి సాగు చేపట్టగా, బోర్లలో నీరు అడుగంటింది. స్వర్ణముఖి బ్యారేజీకి నీటిని విడుదల చేస్తారని ఆశించినా, అలా జరగలేదు. చివరి దశలో నీటిని పూర్తిస్థాయిలో అందించలేకపోయా. పంట దిగుబడి ఆశించినంత స్థాయిలో రాలేదు. కరువు జాబితా నుంచి జిల్లాను తొలగించడం దారుణం.

– ఇనమాల జయరామయ్య, గొల్లపాళెం, వాకాడు మండలం

చినుకు జాడేదీ..?

ఖరీఫ్‌ సీజన్లో వేసిన పంట పూర్తిగా ఎండిపోయింది. అక్టోబర్‌ వచ్చినా, చినుకు జాడ కరువైంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడిన సమయంలో కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాల్సి ఉన్నా, అలా చేయకపోవడం దారుణం. ఇలా అయితే సామాన్య రైతులెలా బతుకుతారు..?

– మాతయ్య, కౌలు రైతు, చిల్లకూరు

ఆత్మకూరు: వడగండ్ల వానతో వరి పైరు దెబ్బతిని రైతులు నష్టపోయినా, పరిహారం నేటికీ అందలేదు. ప్రస్తుతం కొన్ని చోట్ల వరి కోతలు జరుగుతున్నాయి. ఆత్మకూరులో 1600 హెక్టార్లలో వరి సాగవుతుండగా, 32 హెక్టార్లకే ఇన్సురెన్స్‌ చేయించుకున్నారు. సంగంలో 15 వేల ఎకరాలకు గానూ 125 ఎకరాలకే పంట బీమా చేయించారు. అనంతసాగరంలో 400.. చేజర్లలో 1600.. అనుమసముద్రంపేటలో 380.. మర్రిపాడులో 300 ఎకరాల్లో వరి సాగవుతుండగా, ఇక్కడ బీమాను అసలు చేయించుకోనేలేదు.

పొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో 19 వేల ఎకరాల్లో వరి.. 830 ఎకరాల్లో వేరుశనగ సాగు చేపట్టారు. అయితే పంట బీమాను చేయించుకుంది 90 మంది రైతులే.

కరువు కోరల్లో..

ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో 48 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్‌ సీజన్లో మినుము, వరి, జొన్న, సజ్జ, కంది తదితర పంటల సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. జలదంకి మండంలో సోమశిల ఉత్తర కాలువ ద్వారా నీరు రావడంతో వరి పంట రైతుల చేతికి అందింది. అయితే ఉదయగిరి, వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు, సీతారామపురం, కలిగిరి, కొండాపురం మండలాల్లో మినుము, కంది ఇతర మెట్ట పంటలు సాగు కాలేదు. సుమారు 15 వేల ఎకరాలకు గానూ మూడు వేల ఎకరాల్లోనూ పంటలను వేయలేదు. సాగులో ఉన్న పైర్లకు ఐదుగురు రైతులే పంట బీమా చేయించుకున్నారని అధికారులు తెలిపారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో సర్కారే పూర్తిస్ధాయిలో నగదును చెల్లించి బీమా చేసేది. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితే లేదు.

ఇన్సురెన్స్‌ చేయించాలి

రైతులకు ముందే క్రాప్‌ ఇన్సురెన్స్‌ను వ్యవసాయాధికారులు చేయిస్తే, ప్రకృతి విపత్తులకు నష్టపోయిన సమయంలో కొంతవరకై నా ఊరట లభిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో బీమాను సర్కారే చేయించేది. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని విస్మరించారు. రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట దెబ్బతింటే కోలుకోవడం కష్టం.

– కొండారెడ్డి, రైతు, గుంపర్లపాడు, ఏఎస్‌పేట మండలం

నష్టపరిహారాన్ని ఇప్పటికీ ఇవ్వలేదు

గతేడాది అక్టోబర్‌లో కౌలుకు తీసుకొని ఎనిమిదెకరాల్లో సాగు చేశా. అప్పు చేసి పెట్టుబడి పెట్టా. పంట బాగా పండింది. మార్చిలో వరి కోత కోసే ముందు రోజు వడగండ్ల వాన కురిసి పంట మొత్తం దెబ్బతింది. అప్పట్లో హామీ ఇచ్చిన అధికారులు, నేతలు నేటికీ నష్టాన్ని చెల్లించలేదు. ఇన్సురెన్స్‌ చేయించాల్సిన వ్యవసాయాధికారులు ఆ విషయాన్నే పట్టించుకోలేదు.

– దుత్తల రమేష్‌, రైతు, గోవిందమ్మపల్లి, అనంతసాగరం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement