ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేలా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేలా తీర్చిదిద్దాలి

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

వెంకటాచలం: ౖఖెదీల్లో పరివర్తన తీసుకొచ్చే కేంద్రంగా జిల్లా కేంద్ర కారాగారాన్ని తీర్చిదిద్దాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మండలంలోని చెముడుగుంట వద్ద గల జిల్లా కేంద్ర కారాగారంలో శుక్రవారం నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి హాజరైన కలెక్టర్‌ మాట్లాడారు. పుట్టుకతోనే ఎవరూ నేరస్తులు కారని.. సామాజిక, ఆర్థిక, ఎదురైన పరిస్థితులు వారి జీవితాలపై ప్రభావం చూపుతాయని చెప్పారు. నేరానికి దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకొని, ఖైదీల్లో సానుకూల మార్పును తీసుకురావాలని సూచించారు. కారాగారాలను శిక్ష అనుభవించే ప్రదేశాలు కాకుండా, వ్యక్తుల్లో పరివర్తన తీసుకొచ్చే సంస్కరణల కేంద్రాలుగా భావించాలని కోరారు. ఉత్పత్తులను ఖైదీలు తయారు చేస్తుండటాన్ని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన బెంచీలతో సహా ఇతర ఉత్పత్తులను వీరి నుంచి సమకూర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. దీంతో పని కల్పించడంతో పాటు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయొచ్చని పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమలు విస్తరిస్తున్న తరుణంలో ఖైదీలకు వెల్డింగ్‌, ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌ వంటి వృత్తి నైపుణ్యాల్లో శిక్షణను అందించాలని సూచించారు. అనంతరం నరసింహమూర్తి మాట్లాడారు. గత తప్పులపై ఆత్మపరిశీలన చేసుకొని మంచి మార్గంలో పయనించాలని సూచించారు. జైల్లో ఉంటూ విద్యనభ్యసించి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసుకున్న ఖైదీలను అభినందించారు. అనంతరం ధ్రువపత్రాలను అందజేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఏఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement