నెల్లూరు(బారకాసు): మున్సిపల్ కార్మికుల పట్ల పాలకుల నిర్లక్ష్య ధోరణి వీడాలని, తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పందల శ్రీనివాసులు, తాళ్లూరి రమేష్, చంద్రమ్మ, భాగ్యమ్మ డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వెహికల్ షెడ్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ 60 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని, వారసులకు ఉద్యోగం ఇవ్వడం లేదన్నారు. సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేయడం వల్ల సంక్షేమ పథకాలు కూడా కార్మికులకు వర్తించడం లేదని వాపోయారు. ఇప్పటికై నా పాలకులు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని, రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, నాయకులు ఎం.అశోక్, శ్రీనివాసులు, లోకేష్, నాగేశ్వరరావు, శివ, షఫీ పాల్గొన్నారు.


