నెల్లూరు(టౌన్): జిల్లాలో క్రికెట్ జట్ల ఎంపికలో పారదర్శకత లోపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో చోటుచేసుకున్న పలు ఉదంతాలు ఈ అంశాలను తేటతెల్లం చేస్తున్నాయి. ప్రతిభ లేని క్రీడాకారులను ఎంపిక చేశారంటూ గతంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్డీసీఏలో తెరవెనుక ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నారనే ప్రచారమూ లేకపోలేదు. క్రికెట్‌కు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఈయన కనుసన్నల్లోనే జరుగుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎంత మంది నమోదు చేసుకున్నారో..?
అండర్ – 14 జిల్లా జట్టుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 16 నుంచి 23 వరకు చేపట్టారు. 2012, సెప్టెంబర్ ఒకటి నుంచి 2014, ఆగస్ట్ 31 మధ్య జన్మించిన వారు దీనికి అర్హులని ప్రకటించారు. దీనికి గానూ నెల్లూరు, కావలి, గూడూరు సబ్ సెంటర్, వెంకటగిరిలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గల క్రికెట్ క్రీడా ప్రాంగణంలో ఎంపికలను ఆదివారం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా వంద మందికిపైగా క్రీడాకారులు రిజిసే్ట్రషన్ చేసుకున్నారని తెలిసింది. ఇదే విషయమై హెడ్ కోచ్ జుల్కర్‌కు శనివారం రెండు సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. వాస్తవానికి వివరాలను శుక్రవారమే చెప్తానన్న ఈయన తాజాగా ఫోన్ ఎత్తకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో ఇంత గోప్యతను ఎందుకు పాటిస్తున్నారో అంతుచిక్కడంలేదు.
సమావేశం నేడు
నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సమావేశాన్ని ఏసీ స్టేడియం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్నారు. మెన్స్ అండర్ – 19, ఉమెన్స్ అండర్ – 15 జట్ల రివ్యూ.. అండర్ – 15, 19 ఉమెన్స్ జట్ల క్యాంపుల నిర్వహణ.. వాటర్ కూలర్ కొనుగోలు.. ఇలా మరో రెండు, మూడు అంశాలపై చర్చించనున్నారు. నిధుల్లో రూ.1.5 కోట్ల గోల్‌మాల్.. క్రీడాకారులు, తల్లిదండ్రులతో అసభ్య ప్రవర్తన.. ప్రతిభ కనబర్చని వారిని జట్టులోకి ఎంపిక చేయడం లాంటివి చోటుచేసుకున్నాయని, దీనికి సంబంధించిన అసోసియేషన్ సెక్రటరీపై చర్యలు చేపట్టాలంటూ అసోసియేషన్ అధ్యక్షులకు కొంతమంది తాజా, మాజీ సభ్యులు, అభిమానులు లేఖ రాశారు. ఈ అంశమై అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన రాజశేఖర్‌రెడ్డిని గతంలో సంప్రదించగా, విచారణ జరిపి నివేదికను ఇవ్వాల్సిందిగా బాధ్యతను కొందరికి అప్పగించామన్నారు. ఈ వ్యవహారాలపై కలెక్టర్ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
ఏసీ స్టేడియంలోని క్రికెట్ ప్రాంగణం
ఎంపికలను ఏ ప్రాతిపదికన నిర్వహిస్తారో.. న్యాయనిర్ణేతలుగా ఎవరు వ్యవహరిస్తారో.. ఇలా ప్రతి అంశంలోనూ గోప్యతే వీరి నుంచి సమాధానమవుతోంది. గతంలో జరిగిన సెలక్షన్లలోనూ వయస్సు తేడా.. ప్రతిభ లేని వారికి ప్రాధాన్యమిచ్చారని ఆరోపిస్తూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు కొందరు క్రీడాకారుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.


