● గ్రామాల్లో వీస్తున్న వైఎస్సార్సీపీ గాలి
● గతంలో ఓటమి భయంతో తప్పుకొన్న టీడీపీ
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తోటపల్లిగూడూరు(పొదలకూరు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకమని.. గ్రామాల్లో తమ పార్టీ గాలి వీస్తోందని.. ఎలక్షన్లను శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నరుకూరు రిషి గ్రాండ్‌లో పార్టీ శ్రేణులతో శనివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక టీడీపీ తప్పుకొందని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజలు గుర్తుకొచ్చి పింఛన్లను మంజూరు చేస్తామని ప్రకటించారని విమర్శించారు. తమ పార్టీపై ప్రజల్లో ఆదరణ బాగా పెరిగిందని, గత ప్రభుత్వం.. ప్రస్తుత సర్కార్‌పై బేరీజేసుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావడమే ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. పోరాడే సత్తా, ధైర్యం టీడీపీకి లేదని, పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికలను నిర్వహించేందుకు పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. కార్యకర్తల జోలికి ఖాకీలొస్తే ఊరుకునేది లేదని, వారిని న్యాయస్థానాల్లో నిలబెడతామని స్పష్టం చేశారు.
అన్ని స్థానాల్లో పోటీ చేయాలి
గెలుపోటములతో సంబంధం లేదని, స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిందేననే జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను కాకాణి గుర్తుచేశారు. దమ్మున్న నేత కావడంతోనే ఇలాంటి ఆదేశాలను పార్టీ నేతలకు ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు తరహాలో అస్త్రసన్యాసం చేయలేదని, ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. బూటకపు వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చారని, దీనికి సంబంధించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి సంతకాలు పెట్టిన హామీ పత్రాలున్నాయని చెప్పారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
సర్వేపల్లి అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 27 నెలల్లో ఏ మేరకు అభివృద్ధి చేశారని.. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి రమ్మన్నా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అభివృద్ధెక్కడా జరగలేదని.. ఇసుక, మట్టి, బూడిద, గ్రావెల్ అక్రమ తరలింపుతో రూ.కోట్లను గడిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మండల, గ్రామ కమిటీ బాధ్యుల ఐడీ కార్డులను పార్టీ మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్యగౌడ్, రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డికి అందజేశారు.


