● హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ సుబ్బారెడ్డి
నెల్లూరు(లీగల్): కోర్టుల్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయపాలన వ్యవహారాల న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సూచించారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లోని సమావేశ మందిరంలో న్యాయమూర్తులకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. జస్టిస్ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించగా, నోడల్ ఆఫీసర్‌గా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి వ్యవహరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. జూనియర్ సివిల్ జడ్జిలుగా జిల్లాలో నూతనంగా నియమితులైన కిశోర్ భూషణ బోయిన, యజ్ఞశ్రీ, గౌతమి, శ్రావణిరెడ్డి, మృదులతో ప్రమాణం చేయించారు. పలు అంశాలను నెల్లూరు స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి సాయిరామ్, గూడూరు, ఉదయగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీలు మధుబాబు, సత్యకాంత్‌కుమార్ వివరించారు. అదనపు జిల్లా జడ్జిలు శరత్‌బాబు, గీత, సుధ, శుభవాణి, జానీబాషా, శైలజ, నిఖిత ఓరా, కే శైలజ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం
హైకోర్టు జడ్జి, జస్టిస్ సుబ్బారెడ్డికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అదనపు న్యాయమూర్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించి, కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.


