నెల్లూరు(అర్బన్): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహిస్తున్న ఎంఎస్‌ఆర్ స్పాస్టిక్స్ సెంటర్‌లో 14 ఏళ్లలోపు మానసిక, శారీరక దివ్యాంగ చిన్నారులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉదయభాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక విద్యతోపాటు స్కూలు బస్సు సౌకర్యాన్ని కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రవేశాలకు ఎలాంటి ఫీజు లేదన్నారు. ఆసక్తి గల తల్లిదండ్రులు వివరాల కోసం మద్రాస్ బస్టాండ్ సమీపంలోని రెడ్‌క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్‌ను లేదా 86399 34861 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
నిధుల దుర్వినియోగంజరగలేదు : ఆర్జేడీ
నెల్లూరు(టౌన్): జిల్లాలో సమగ్రశిక్షకు సంబంధించి ఆయా పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాల్లో నిధుల దుర్వినియోగం జరగలేదని విద్యాశాఖ ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధి నిధులతో ఆయా పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలు జరిగాయన్నారు. వీటికి సంబంధించి డబుల్ పేమెంట్ జరిగిందన్న ఆరోపణలు వచ్చినా, విచారణలో అలాంటిదేమీ లేదని స్పష్టమైందన్నారు. సమగ్రశిక్షలో ఇంజినీర్లు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. దీనిపై రాష్ట్ర కార్యాలయంలో వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. 2014 – 19వ సంవత్సరంలో స్పిల్ ఓవర్ వర్క్స్‌లో రూ.1.93 కోట్లు నిధులు గోల్‌మాల్ చేశారని పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఈ నిధులను నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే చెల్లించినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఇది కూడా రాష్ట్ర కార్యాలయం నుంచే పేమెంట్ జరిగిందన్నారు. సమగ్రశిక్షలో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై కలెక్టర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారని, ప్రస్తుతం వారు విచారణ చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఈఓ ఆర్.బాలాజీరావు, మాజీ ఏపీసీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
కుష్టు వ్యాధి
సర్వే వేగవంతం
● అడిషనల్ డీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ
నెల్లూరు(అర్బన్): కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను వేగవంతంగా నిర్వహించాలని అడిషనల్ డీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ ఆదేశించారు. మంగళవారం సంతపేటలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయొచ్చన్నారు. ప్రధానంగా రొయ్యల గుంతలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో సర్వేను మరింత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా నమోదైన రోగులతో సన్నిహితంగా ఉన్నవారికి వ్యాధి సోకకుండా పెప్ మాత్రలు అందించాలని ఆదేశించారు. ప్రతినెలా 11వ తేదీన అంగవైకల్యం ఉన్న కుష్టు బాధితుల కోసం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పీఓడీ శిబిరాలు నిర్వహించి, వారికి అవసరమైన ఎంసీఆర్ చెప్పులతోపాటు ఇతర సహాయక వస్తువులు అందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్, టీహెచ్ వార్డు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షాలిని, ఫిజియోథెరపిస్టులు నరసింహులు, జోబు, పీఎంఓ మల్లమ్మ, డీపీఎంలు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు
● డీపీఓ వసుమతి
నెల్లూరు(పొగతోట): గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీపీఓ, జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల అధికారి, జెడ్పీ సీఈఓ వసుమతి ఆదేశించారు. మంగళవారం నెల్లూరులోని హరనాథపురం, లేక్‌వ్యూ కాలనీ, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లోని సచివాలయాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ సర్వేలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈకేవైసీ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆధార్‌కార్డు ల్లేని పిల్లల వివరాలు సేకరించాలన్నారు. అర్హులైన వారికి పథకాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది అంకితభావంతో పని చేయాలని సూచించారు.


