చిల్లకూరు: మండల తీర ప్రాంతంలోని కండలేరు క్రీక్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని మోమిడి గ్రామ సమీపంలోని పడవల రేవు వద్ద క్రీక్‌లో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని క్రీక్‌లో నుంచి బయటకు తీయించి పరిశీలించారు. మృతుడి కుడి కాలు పాదం సరిగ్గా లేకపోవడంతో క్రీక్ పరిసర గ్రామాల్లో ఆరా తీశారు. అతను చిల్లకూరు మండలానికి చెందిన వ్యక్తి కాదని తేలడంతో, క్రీక్‌కు అవతల ఉన్న వెంకటాచలం మండలంలోని గ్రామాల్లో విచారణ చేపట్టారు. వెంకటాచలం మండలం వెంకటరెడ్డిపాళెం గ్రామానికి చెందిన నడవల నాగరాజు (47)గా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. నాగరాజు కుడి కాలు పాదం సరిగ్గా లేకపోవడంతో కండలేరు క్రీక్ వద్ద పట్టు తప్పి నీటిలో పడి చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సముద్రంలో పోటు కారణంగా మృతదేహం మోమిడి సమీపంలోని క్రీక్‌లోకి వచ్చి ఉంటుందని తెలిపారు. అయితే మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా కుటుంబ సభ్యులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


