● అటవీ అధికారులు, పోలీసుల దాడులు
● అదుపులో మేస్త్రి
● తవ్వకం చేసిన వారిపై విచారణ
● బాధ్యులపై చర్యలు ఉండేనా?
సైదాపురం: మండల కేంద్రమైన సైదాపురానికి కూతవేటు దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పురాతన పల్లిమిట్ట మైన్‌ల్లో అలజడి చెలరేగింది. అక్కడ అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. ఈక్రమంలో కొందరు కళ్లు ఇటీవల దానిపై పడింది. మంగళవారం ఆ మైన్‌లో కూలీల చేత పనులు చేయిస్తున్నారంటూ అధికారులకు సమాచారం అందింది. అటవీ, స్థానిక పోలీసులతోపాటు పలువురు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మైన్‌లోని ఓ ప్రాంతంలో ఖనిజాన్ని వెలికి తీస్తుండగా అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కూలీలు ఉడాయించారు. దీంతో పనులు చేయించే మేస్త్రిని అదుపులోకి తీసుకున్నారు. పారలు, ఇతర సామగ్రి, ఆటోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లీజుకు దరఖాస్తు
ఈ మైన్‌ను కొందరు స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈక్రమంలో గూడూరు ప్రాంతానికి ఓ వ్యక్తి మైనింగ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. గనికి లీజు వేసిన వ్యక్తులే పనులు చేసి ఉంటారనే అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా అనుమతి రాకముందే పట్టపగలే అక్రమ మార్గంలో కూలీలచే బాహాటంగా పనులు చేయించారు. మేస్త్రిని అధికారులు విచారణ చేసి అక్రమ మైనింగ్ పాల్పడిన వారెవరు అనే అంశంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
అటవీ ప్రాంతంలో అనుమతి లేకుండా పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు అటవీ శాఖ రేంజర్ మాల్యాద్రి స్పష్టం చేశారు. సైదాపురం సమీపంలోని పల్లెమిట్ట మైన్‌లో కూలీలచే పనులు జరుగుతున్న సమయంలో తమ సిబ్బంది దాడులు చేశారన్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారిౖపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తవ్వకాలు సాగించిన ప్రాంతం
స్వాధీనం చేసుకున్న పరికరాలు


