చంద్రబాబు మోసాలపై దండయాత్ర | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మోసాలపై దండయాత్ర

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

‘వెన్నుపోటుకు రెండేళ్లు’కు వెల్లువెత్తిన ప్రజాభిమానం

హోరెత్తిన ర్యాలీలు

మేనిఫెస్టో ప్రతుల దహనం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి జిల్లాలో ప్రజాభిమానం వెల్లువెత్తింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు మండల కేంద్రాల్లో కార్యక్రమాలను పార్టీ శ్రేణులు గురువారం నిర్వహించాయి. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలను చేపట్టారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ఎండగట్టారు.

హామీల అమల్లో ఘోరంగా విఫలం

వెంకటాచలం: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమల్లో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత విమర్శించారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలంలో పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో హామీ పత్రాలు, వివిధ పత్రికల ద్వారా విడుదల చేసిన ప్రకటనల ప్రతులను సర్వేపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద దహనం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టి.. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బూటకపు హామీలతో చంద్రబాబు గద్దెనెక్కి రెండేళ్లు పూర్తవుతోందని, అయితే నేటికీ మాటను ఆయన నిలబెట్టుకోలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలపై రాష్ట్ర ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారానని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రిస్తామని చెప్పిన చంద్రబాబు.. ప్రస్తుతం దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధిక ధరలున్న రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ఎరువుల ధరలు నియంత్రణలో లేకపోవడంతో రైతులు అధిక పెట్టుబడులు పెట్టాల్సిన దుస్థితి ప్రస్తుతం ఏర్పడిందని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తానన్న చంద్రబాబు.. ఆ ఊసే లేకుండా పాలనను సాగిస్తుండటంతో వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పేదలకు వైద్య విద్యనందించేందుకు 17 మెడికల్‌ కళాశాలలను తీసుకొస్తే, వీటిని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేసిందని మండిపడ్డారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దారుణంగా వంచించారని, స్పోర్ట్స్‌ కోటా భర్తీలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. ఎన్నికలెప్పుడు జరిగినా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, వైస్‌ ఎంపీపీలు కనుపూరు కోదండరామిరెడ్డి, పచ్చబట్ల మస్తానయ్య, మండల కన్వీనర్‌ కొణిదెన మోహన్‌నాయుడు, నేతలు ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, కొణిదెన విజయభాస్కర్‌నాయుడు, మందల పెంచలయ్య, వెలిబోయిన వెంకటేశ్వర్లు, ముంగర శ్రీనివాసులు, పామూరు కృష్ణారెడ్డి, మంచు వెంకటేశ్వర్లునాయుడు, డేగా శ్రీనివాసులు, చీకుర్తి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

విజయకుమార్‌రెడ్డి, అరుణమ్మ ఆధ్వర్యంలో నిరసన

హామీ ప్రతులను దహనం చేస్తున్న కాకాణి పూజిత తదితరులు

మోసపూరిత పాలనను

అర్థం చేసుకున్నారు..

నెల్లూరు సిటీ: రెండేళ్ల కూటమి పాలనలో జరిగిన మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీ ప్రతులను రూరల్‌ మండలంలోని సౌత్‌మోపూరులో గురువారం దహనం చేసిన అనంతరం వారు మాట్లాడారు. హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 99 శాతం హామీలను అమలు చేసి మాటపై నిలిచారని గుర్తుచేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పుచ్చలపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీసునంద, నేతలు నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, శ్యామ్‌సింగ్‌, సుబ్బారెడ్డి, ఆదిరెడ్డి నారాయణరెడ్డి, హరిశివారెడ్డి, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు రూరల్‌: ఎన్నికల సమయంలో ప్రత్యేక బాండ్లిచ్చి.. ఇంటింటికీ వెళ్లి ప్రజలను మభ్యపెట్టి టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నగరంలోని పాత చెక్‌పోస్టు సెంటర్‌లో భారీ నిరసన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే మహిళలకు పింఛన్‌ వంటి కీలక హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు.

ప్రశ్నిస్తే.. బాధ్యతల నుంచి తప్పుకొంటోంది

హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తుంటే, బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకొంటోందని చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. చెప్పింది చేయలేక.. తిరిగి తమ పార్టీ శ్రేణులపై ఆరోపణలు చేస్తున్నారని, ఇంత కంటే దిగజారుడుతనం ఎక్కడైనా ఉందానని ప్రశ్నించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులను దగా చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు కమిషన్‌ను సైతం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన టీడీపీ అధికారంలో కొనసాగే అర్హతను కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ఈ నెల 12న నిర్వహించనున్నామని వెల్లడించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తమ పార్టీ శ్రేణులపై ఎలాంటి కేసులు పెట్టినా, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

ఉద్యోగాలను అమ్ముకున్నారు..

మెగా డీఎస్సీ పేరుతో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఒక్కో టీచర్‌ పోస్టును రూ.15 లక్షలకు విక్రయించారని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై బాధితులకు అండగా నిలిచేందుకు తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఖలీల్‌ అహ్మద్‌, సిటీ, ఆత్మకూరు పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, పేర్నేటి కోటేశ్వర్‌రెడ్డి, సిటీ మహిళాధ్యక్షురాలు ధనుజారెడ్డి, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement