● నెల్లూరు నగరంలో ఇదీ పరిస్థితి
● పట్టించుకోని నగరపాలక సంస్థ
● తాజాగా మూడో డివిజన్‌లో
ఇరిగేషన్ స్థలం ఆక్రమణ
● మంత్రి, కమిషనర్
మాటలు నీటిమూటలే..
నెల్లూరు(బారకాసు): తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరులో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. అయినా సంబంధిత శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. నగరపాలక సంస్థ పరిధిలో 54 డివిజన్లున్నాయి. దాదాపు 150 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉన్న నగరంలో ప్రభుత్వానికి చెందిన అనేక స్థలాలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్‌కు సంబంధించి రూ.కోట్ల విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే ముత్తుకూరు రోడ్డులోని కృష్ణపట్నం కాలువ వెంబడి స్థలాన్ని కొందరు ఆక్రమించి దుకాణాలు నిర్మించి విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో దాదాపు 50కి పైగా దుకాణాలు ఏర్పాటు చేసి వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
మైపాడు రోడ్డులో..
తాజాగా మైపాడురోడ్డులో మూడో డివిజన్ పరిధిలో ఇరిగేషన్ స్థలాన్ని కొందరు ఇష్టారాజ్యంగా ఆక్రమించేసి దుకాణాలు ఏర్పాటు చేసి వాటిని విక్రయించడం, లీజుకు ఇవ్వడం చేస్తున్నారు. కిసాన్ నగర్ సమీపంలో వేణుగోపాల స్వామి దేవస్థాన స్థలానికి ఆనుకున్ని ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని కూడా పలువురు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. అక్కడి సమీప ప్రాంతంలోనే కార్పొరేషన్‌కు చెందిన చేపల మార్కెట్ పక్కనే ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు ముందు వైపు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని నాలుగు రోజుల క్రితం ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. ఈ స్థలం దాదాపు 30 నుంచి 40 అంకణాల వరకు ఉంటుంది. ఒక అంకణం రూ.4 లక్షల వరకు ధర పలుకుతోంది. రూ.కోటికిపైగానే విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గోడ నిర్మిస్తే సంబంధిత అధికారులెవరూ పట్టించకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బార్ పక్కనే ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని కొందరు ఆక్రమించి దుకాణాలు నిర్మించగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణలో భాగంగా వాటిని తొలగించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మరలా అదే స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు నిర్మించి అద్దెలకు ఇచ్చుకుని తమ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి మాటలు నీటి మూటలేనా?
ప్రభుత్వానికి చెందిన పార్కు, ఇరిగేషన్ స్థలాలు, దేవస్థాన భూములు ఎవరైనా ఆక్రమించినట్లు తెలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ నిత్యం చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. మంత్రి అనుచరుల్లో కొందరు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు కమిషనర్ నందన్ నిత్యం వార్డుల్లో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పదేపదే చెబుతున్నారు. అలాంటిది మూడో డివిజన్‌లో ఆక్రమణకు గురైన రూ.కోట్ల విలువైన స్థలం ఆయనకు కనిపించలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నెల్లూరు నగరంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిన అవసరముంది.


