● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్
చిల్లకూరు: ‘వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడటం లేదు. పోలీసులు ప్రభుత్వానికి కీలుబొమ్మలా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించేందుకు అత్యుత్సాహం చూపిస్తే కోర్టు ఎదుట హాజరయ్యే పరిస్థితి ఏర్పడుతుంది’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరులోని సనత్ నగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం కార్యకర్తలు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గూడూరు రూరల్ పరిధిలోని మంగళపూరు గ్రామానికి చెందిన రవీంద్రపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారన్నారు. కేసు విషయంలో రవీంద్ర కోసం ఇంటికి వెళ్లిన పోలీసులు అతను లేకపోతే ఎక్కడో కూలీ పనులు చేసుకుంటున్న తండ్రి పోలయ్యను ఆచూకీ చెప్పమని చితబాది అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి హింసించడం దారుణమన్నారు. వారు కొట్టిన దెబ్బలకు తాళలేక తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలయ్య తనపై జరిగిన దాడికి హైకోర్టును ఆశ్రయించగా బాధ్యులైన పోలీసులతోపాటు అధికారులను నేరుగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిందన్నారు. అలాగే దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పడం పోలీసులకు చెంప పెట్టులాంటిదని తెలిపారు. అక్రమ కేసులు బనాయించి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయాలని చూస్తే భవిష్యత్‌లో పోలీసులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇకనైనా అక్రమ కేసులు బనాయించే విషయంలో ఆలోచన చేయాలన్నారు. ఆయన వెంట పలువురు పలువురు నాయకులున్నారు.


