సీమ ప్రాజెక్ట్ సాధనకు పోరాడుతాం
వెలుగొండకు మోకాలడ్డు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు రైతాంగం పాలిట జలద్రోహి అని, ఆయన పాలనలో ఏనాడు ఒక్క ప్రాజెక్ట్‌ను ప్రారంభించనూ లేదు.. పూర్తి చేయనూ లేదని, దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జలప్రాజెక్ట్‌లనూ ప్రభుత్వం మారాక తుంగలో తొక్కారని వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. వైఎస్సార్, వైఎస్ జగన్ దూరదృష్టితోనే ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేప ట్టి పూర్తి చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసే అత్యంత గొప్ప ప్రాజెక్ట్ అన్నారు. అటువంటి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టి రైతుల గుండెల్లో గునపాలు దింపారని మండిపడ్డారు. చంద్రబాబు అటకెక్కించిన పథకాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నగరంలోని వేదాయపాళెం ఆర్‌ఎస్‌ఎన్ కల్యాణ మండపంలో రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, నాయకులతో కాకాణి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, కోవూరుకు చెందిన బత్తుల విజయ్‌కుమార్, సూళ్లూరుపేటకు చెందిన గీతానందరెడ్డి, ఉదయగిరికి చెందిన వెంకట్‌రెడ్డి, నెల్లూరురూరల్‌కు చెందిన రాంప్రసాద్‌రెడ్డి, కొడవలూరు దామోదర్‌రెడ్డి, ఆత్మకూరుకు చెందిన ఏ కోటిరెడ్డి, వెంకటగిరికి చెందిన దశరథరామిరెడ్డి, భాస్కర్‌గౌడ్, చిలుకూరు సురేష్,సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ నెల్లూరు సుబ్బు, తదితరులు ప్రసంగించారు. ఉదయగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేక పాటి రాజగోపాల్‌రెడ్డి, విజయ డెయిరీ మాజీచైర్మన్ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు తెలంగాణ నీటి దోపిడీపై మాట్లాడలేకపోయారని, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఏకంగా ఆయనకు రాజకీయ ప్రయోజనం కల్పించేందుకు సీమతోపాటు నెల్లూ రు, ప్రకాశం జిల్లాలను తాకట్టు పెట్టారన్నారు. జిల్లా రైతాంగానికి మేలు చేసిన సీఎంలు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అని గుర్తు చేశారు. అప్పట్లో వరుసగా తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమగ్ర సోమశిల విషయంలో ఒక అడుగు నీటి మట్టాన్ని కూడా చంద్రబాబు పెంచలేకపోయారన్నారు. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సమగ్రసోమశిలతో పాటు స్వర్ణముఖి బ్యారేజీలను పూర్తి చేసి రైతాంగానికి అంకితం చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో 35 టీఎంసీలను మాత్రమే సోమశిలలో నిలువ చేస్తున్న క్రమంలో వైఎస్సార్ తన సొంత జిల్లాలో ఒక గ్రామాన్ని ఖాళీ చేయించి 78 టీఎంసీల సమగ్ర సోమశిలకు కృషి చేశారన్నారు. వైఎస్ జగన్ సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసి మేకపాటి గౌతమ్‌రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్లను పెడితే టీడీపీ ప్రభుత్వం వచ్చి వెంటనే తొలగించిందన్నారు. వైఎస్ జగన్ కృషితో కండలేరు వరద కాలువ పరిమాణాన్ని 24 వేల క్యూసెక్కులకు పెంచగా, చంద్రబాబు ఆ పనులు కూడా ఆపేశారన్నారు.
సీమతోపాటు నెల్లూరు ప్రజల గుండెల్లో గునపాలు
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌తో
ముక్కారు పంటలతో సస్యశ్యామలం
వైఎస్సార్, వైఎస్ జగన్ దూరదృష్టితోనే ప్రాజెక్ట్‌ల నిర్మాణం
సమగ్ర సోమశిల, స్వర్ణముఖి, నెల్లూరు, సంగం బ్యారేజ్‌లు ఘనత వీరిదే
రైతాంగం ఐక్యంగా సర్కారు మెడలు వంచకపోతే జిల్లా ఎడారే
రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రులు శైలజానాథ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాకే శైలజానాథ్ మాట్లాడుతూ శ్రీశైలంలో 800 అడుగుల డెడ్ స్టోరేజీ ఉన్నప్పుడు సైతం తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 8 టీఎంసీల నీటిని తరలిస్తోందన్నారు. 854 టీఎంసీలు నీరుంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ, నెల్లూరుకు నీటిని తరలించే అవకాశముందన్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్ వల్ల దిగువ కృష్ణాకు వరద జలాలు తగ్గిపోయాయన్నారు. తెలంగాణ నీటి దోపిడీ వల్ల ప్రాజెక్ట్ 854 అడుగులకు చేరడం గగనంగా మారిందన్నారు. ఈ పరిస్థితిని గమనించిన జగన్‌మోహన్‌రెడ్డి సీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సీమతో పాటు నెల్లూరుకు తరలించేందుకు ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ఈ పథకం పూర్తయితే ప్రతి రోజూ కూడా 3 టీఎంసీలు ఈ ప్రాంతానికి చేరేవన్నారు. రైతుల నీటి కష్టాలు తీర్చడం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తర్వాత ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమైందన్నారు. బ్యారేజీలను వైఎస్సార్ పూర్తి చేస్తే, నెల్లూరు, సంగం బ్యారేజీలను జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేశారన్నారు. చంద్రబాబు కాలంలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు.


