● హోటళ్ల నిర్వాహకుల ఆందోళన
● రెవెన్యూ, పోలీస్ అధికారుల నుంచి కూడా ఒత్తిళ్లు
● 115 లాడ్జీలు, హోటల్స్, గెస్ట్‌ఇన్‌లు,
గెస్ట్‌హౌస్‌ల బుకింగ్
● వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి
తప్పని తిప్పలు
నెల్లూరు సిటీ: తెలుగుదేశం పార్టీ మహానాడు కారణంగా సామాన్యులకు తిప్పలు తప్పేలా లేవు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు కిసాన్ సెజ్‌లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన భూమి పూజ బుధవారం జరుగుతుంది. అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మహానాడుకు జిల్లాల నుంచి తరలివచ్చే నాయకులు, కార్యకర్తల కోసం నెల్లూరు నగర, రూరల్ టీడీపీ నాయకులు హోటళ్లు, లాడ్జీలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.
అన్నీ మాకే..
నెల్లూరు నగరపాలక సంస్ధపరిధిలో మొత్తం 85 లాడ్జీలు, హోటళ్లు, 30 గెస్ట్‌హౌస్‌లు, గెస్ట్‌ఇన్‌లు ఉన్నాయి. నగర, రూరల్ నియోజకవర్గంలోని ముఖ్యనేతలు తమ బలాన్ని వినియోగించి ఆ మూడురోజులపాటు ఎవరికీ గదులు ఇవ్వకూడదని హుకుం జారీ చేశారు. తాము పంపిన వారికే రూమ్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులకు కూడా రూమ్స్ లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీ అధిస్టానం నుంచి ఓ నేతకు ఫోన్ కాల్ రావడంతో తప్పని పరిస్థితిలో కొన్నింటిని కేటాయించారని తెలుస్తోంది.
తీవ్ర ఇబ్బందులు
పనులు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు వివిధ జిల్లాల ప్రజలు నిత్యం నెల్లూరు నగరానికి వస్తుంటారు. హోటళ్లలో గదులు తీసుకుంటుంటారు. మహానాడు జరిగే రోజుల్లో వచ్చే సామాన్య ప్రజలకు తప్పేలా లేవు. ఆ మూడు రోజులు నెల్లూరు నగరంలో నరకం కనిపిస్తుందని అర్థమవుతోంది. ఫంక్షన్లకు వచ్చారంటే ఎక్కడ ఉండాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓవైపు ఎండల మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గదులు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.
ఇదేం కర్మ
ఓ మేడమ్..!
రూమ్స్ ఇవ్వాల్సిందే...
మీ ఓనర్‌కు చెప్పు..!
టీడీపీ నేతలు ఓవైపు, రెవెన్యూ, కార్పొరేషన్, పోలీసు అధికారుల నుంచి మరోవైపు ఒత్తిళ్లు వస్తుండటంతో మాకేంటి ఈ కర్మ అని హోటళ్ల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. కొందరు నాయకులు ఉచితంగా రూమ్స్ ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నేతల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు.


