చిల్లకూరు: తండ్రి ఆస్తి కోసం ఓ వ్యక్తి అక్కపై దాడి చేసిన ఘటన గూడూరు రూరల్ పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పద్మమ్మ, శంకరయ్య అనే వారి మధ్య కొంతకాలంగా తండ్రి ఆస్తి విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శంకరయ్య తన అక్క పద్మమ్మపై దాడికి పాల్పడటంతో ఆమె గాయపడి గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.
రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్
● కడప కేంద్ర కారాగారానికి
తరలింపు
నెల్లూరు(క్రైమ్): తీరు మారని రౌడీషీటర్లపై ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. నెల్లూరు రామచంద్రాపురానికి చెందిన పి.మనోహర్ అలియాస్ మనుపై నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. అతను ప్రస్తుతం బంగ్లాతోటలో నివాసం ఉంటున్నాడు. హత్య, హత్యాయత్నం కిడ్నాప్, దాడి తదితర తొమ్మిది కేసులున్నాయి. పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని తీరులో మార్పురాలేదు. నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వుల మేరకు మంగళవారం మనోహర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తతో మెలగాలని, ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యుత్ వైర్ల చోరీ
కోట: పొలాల్లో మోటార్లకు ఉన్న విద్యుత్ వైర్లు చోరీకి గురవుతున్నాయని మండలంలోని వెంకన్నపాళెం, తిన్నెలపూడి గ్రామాల రైతులు మంగళవారం ఎస్సై పవన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు మోటార్లకు ఉన్న వైర్లను తస్కరిస్తున్నారని, దీంతో నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా సుమారు 50 మంది రైతులకు చెందిన వైర్లు చోరీ జరిగినట్లు వెల్లడించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
కండలేరులో 43.190
టీఎంసీల నీరు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారానికి 43.190 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 400, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


