నెల్లూరు(టౌన్): ఈనెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 56 కేంద్రాల్లో వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌కే జసీమ్ తెలిపారు. మంగళవారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలకు శిక్షణ ఇస్తున్న కోచ్‌లకు పరికరాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిబిరాలకు హాజరువుతున్న క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయాలన్నారు. క్రీడలతో మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందన్నారు. సెట్నల్ సీఈఓ, జిల్లా పారిశ్రామిక డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఉన్నత క్రీడాకారులుగా ఎదగడానికి వేసవి శిబిరాలు మంచి అవకాశమన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనం మహేష్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శాప్‌లీగ్స్ లాంటి టోర్నమెంట్‌లను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కె.గురుప్రసాద్, ఎస్సీజీఎఫ్‌ఐ సెక్రటరీ దేవిక, రమణయ్య, వివేకానంద, ఏసీ సుబ్బారెడ్డి, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


