మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చి ఉంటే.. జిల్లా ముక్కారు పంటలతో సస్యశ్యామలంగా మారేది. చంద్రబాబు రాజకీయ స్వార్థానికి కరువు ప్రాంతంగా మారనుంది. ఆయన ఆది నుంచి జల ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకి. జిల్లాలోని సోమశిల, నెల్లూరు, సంగం, స్వర్ణముఖి బ్యారేజ్‌లతో పాటు సోమశిల ఉత్తర కాలువ ప్రాజెక్ట్‌లు ఆయన పాలనకు దృష్టాంతంగా నిలుస్తాయి. ఆ నాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులర్ కెపాసిటీ పెంచి సమగ్ర సోమశిలను సాకారం చేయకపోయి ఉంటే.. ఈ పాటికి జిల్లా మరో కరువు ప్రాంతంగా మిగిలిపోయేది.
వైఎస్ జగన్ సీఎం అయ్యాక..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జల ప్రాజెక్ట్‌ల అభివృద్ధిని పరుగులు పెట్టించి.. గంగమ్మను ఉరకలెత్తించి జిల్లాను సస్యశ్యామలం చేశారు. చంద్రబాబు 17 ఏళ్లు అధికారంలో ఉండి.. జిల్లాలో ఇది తాను నిర్మించి ప్రజలకు అంకింతం చేశానని చెప్పుకునే ఒక్క ప్రాజెక్ట్ లేదంటే అతిశయోక్తి లేదు. జిల్లా జలనిధి సోమశిల పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు అయితే.. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల ప్రజలు, రైతులకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్ట్ పనులు నిలిపివేయడంతో ఆయన హయాంలో 35–40 టీఎంసీలకే పరిమితమైంది.
సమగ్ర సోమశిల నెరవేర్చిన వైఎస్సార్
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రెండేళ్లలోనే సమగ్ర సోమశిలను సాకారం చేశారు. దశాబ్దాలుగా కల్లలుగా మిగిలిపోయిన జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 35–40 టీఎంసీలకే పరిమితమైన సోమశిల అభివృద్ధికి జలయజ్ఞం ద్వారా శ్రీకారం చుట్టారు. ముంపు గ్రామాలకు పరిహారం చెల్లించడం, అటవీ శాఖ అనుమతులు చకచకా తీసుకుని 2007–08 నాటికి జలాశయంలో నీటి సామర్థ్యాన్ని 72 టీఎంసీలకు పెంచి సింహపురి రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్సార్ కేవలం రెండేళ్లల్లోనే రెట్టింపు స్థాయిలో నీటి నిల్వలను పెంచగలిగారు. చంద్రబాబు తొలుత తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉండీ సోమశిలలో నిల్వ సామర్థ్యాన్ని కనీసం ఒక్క టీఎంసీ కూడా పెంచలేకపోయారు.
కృష్ణమ్మను ఒడిసి పట్టి.. సోమశిలకు మళ్లించి..
ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణానది వరద నీటిని శ్రీశైలం డ్యాం ద్వారా రాయలసీమతోపాటు నెల్లూరుకు మళ్లించేందుకు ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కేవలం 1,500 క్యూసెక్కుల కెపాసిటి కలిగి ఉండేది. దీన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా హెడ్ రెగ్యులేటర్‌తో పాటు కాలువలను ఆధునికీకరించారు. అయితే వాస్తవంగా 1.10 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు దాదాపు 10 టీఎంసీలకుపైగా తరలించే విధంగా అభివృద్ధి చేశారు. ఆ విధంగా కృష్ణమ్మను ఒడిసి పట్టి.. సోమశిలకు మళ్లించారు. ఆ నాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌తో పాటు కాలువలను అభివృద్ధి చేయకపోయి ఉంటే.. నెల్లూరుతోపాటు రాయలసీమ సైతం ఎడారిగా మారేది.
2 లక్షల నుంచి 5.84 లక్షల ఎకరాల
ఆయకట్టుకు సాగునీరు
ఆ నాడు వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా పెన్నార్‌డెల్టాతో పాటు మెట్టప్రాంత భూముల ను సస్యశ్యామలం చేసేందుకు రూ.220 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సోమశిల ప్రాజెక్ట్ ద్వారా అప్పటి వరకు 2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఉంటే.. దాన్ని ఏకంగా 5,84,500 ఎకరాలకు స్థిరీకరించారు. వాకాడు వద్ద స్వర్ణముఖిపై 35 ఎంటీఎస్ కెపాసిటితో బ్యారేజీని నిర్మించి ఆ ప్రాంత రైతులకు, స్థానికులకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారు.
ఎత్తిపోతల పథకం వస్తే.. ముక్కారు పంటలే
ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించే వెసులుబాటు ఉండేది. దీంతో రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్‌లు, ఊరూరా చెరువులు నిరంతరం జలకళతో నిండుకుండలా మారేవి. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. తెలుగుగంగ, ఎఫ్‌ఆర్‌సీసీ, గాలేరు, నగరి ఆయకట్టుకు సాగునీరు, చైన్నెకు తాగునీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే విడుదల చేయాలి. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 841 అడుగుల నీటిమట్టం వద్ద అమర్చారు. ప్రాజెక్ట్‌లో 841 అడుగుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంది. అంతకు దిగువకు నీటిమట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఈ తరుణంలో ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నిత్యం 3 టీఎంసీలు నీటిని తోడుకునే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూకుడుగా ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. 20 శాతం పనులు జరిగిన సమయానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయడంతో వ్యతిరేకించినప్పటికీ దాదాపు 80 శాతం పనులను పూర్తి చేశారు.
దివంగత సీఎం వైఎస్సార్
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ కెపాసిటీ పెంచకపోతే జిల్లా ఎడారే
మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలోనే జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌లకు మోక్షం
రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం ద్వారా రోజుకు మూడు టీఎంసీలు
చంద్రబాబు పాలన.. జిల్లాకు శాపం
చంద్రబాబు మౌనం.. సీమకు శాపం
శ్రీశైలం దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు అనుమతిచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. కానీ 2014 నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం ప్రారంభం కాకున్నా ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నీటి మట్టంతో డెడ్ స్టోరేజీలో ఉన్నప్పటికీ నీటిని శ్రీశైలం దిగువన ఎలాంటి అవసరాలు లేనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీలు, ఎస్‌ఎల్‌పీసీ నుంచి 0.5 టీఎంసీలు, పాలమూరు, రంగారెడ్డి, డీఎం ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరశి రోజుకు 6.95 టీఎంసీలు తరలించుకుపోతోంది. అయినా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఈ పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణతో పోటీగా రోజుకు 3 టీఎంసీలు తరలించి సీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు జలకళతో విలసిల్లేవి. చంద్రబాబు ఈ పథకాన్ని పక్కన పెట్టడంతో ఈ ప్రాంతాలకు శాపంగా పరిణమించనుంది.
వైఎస్సార్ హయాంలో 72 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి పెరిగిన సోమశిలను తర్వాతి పాలకులు పట్టించుకోలేదు. వైస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక.. సోమశిల ప్రాజెక్ట్‌లకు సంబంధించి పెండింగ్ అటవీభూములు, పరిహారాలు చెల్లింపులను క్లియర్ చేసి 78 టీఎంసీల కెపాసిటికి పెంచి సమగ్ర సోమశిలను సాకారం చేశారు. అదే సమయంలో వైఎస్సార్ హయాంలో శ్రీకారం చుట్టి సంగం, నెల్లూరు బ్యారేజీలను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ రెండేళ్ల కరోనా వంటి విపత్తును సైతం ఎదుర్కొని వీటిని పూర్తి చేసి రైతులకు అంకితం చేశారు. వీటితోపాటు సోమశిల–కండలేరు, కండలేరు– స్వర్ణముఖి కాలువ కెపాసిటిని రెట్టింపు చేశారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణతోపాటు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.


