● జిల్లాలో దెబ్బతిన్న
604 హెక్టార్లలోని ఉద్యాన పంటలు
● రూ. 15.60 కోట్ల మేర పంట నష్టం
నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం ఉద్యాన రైతులకు అపార నష్టాన్ని కలిగించింది. ఈదురుగాలులతో పాటు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి జిల్లాలోని ఏడు మండలాల్లో 477 మంది రైతులకు చెందిన 604 హెక్టార్లలోని మామిడి,డ్రాగన్‌ఫ్రూట్, బొప్పాయి, నిమ్మ పంటలకు నష్టం వాటిల్లింది. కావలి మండలంలోని ఆర్‌సీపాళెంలో 35 మంది రైతులకు చెందిన 50 హెక్టార్లలోని మామిడి తోటల్లోని మామిడి కాయలు రాలిపోయాయి. జలదంకి మండలం గట్టుపల్లి, చోడవరం, చినక్రాక గామాల్లో 114 మంది రైతులకు చెందిన 200 హెక్టార్లలోని మామిడి చెట్లు నేలకొరగడంతో పాటు పండ్లు రాలిపోవడంతో అపార నష్టం సంభవించింది. కలిగిరి మండలం కుమ్మరకొండూరు, వెలగపూడి, గుడ్లదొన, లక్ష్మీపురం గ్రామాల్లో 30మంది రైతులకు చెందిన 111హెక్టార్లలోని మామిడి, బొప్పాయి చెట్లు నేలకొరగడం, కాయలు రాలిపోవడంతో నష్టం వాటిల్లింది. మర్రిపాడు మండలం చిన్నమాచనూరు, కదిరినేనిపల్లి గ్రామాల్లో 9 మంది రైతులకు చెందిన 10 హెక్టార్లలోని మామిడి, నిమ్మ, డ్రాగన్‌ప్రూట్ చెట్ల కొమ్మలు విరగడంతో పాటు పండ్లు రాలిపోయాయి. సైదాపురం మండలం వేములచేడు, పాడూరు, చాగణం, కొమ్మిపాడు, పోతుగుంట, చీకవోలు గ్రామాల్లో 283 మంది రైతులకు చెందిన 192 హెక్టార్లలోని మామిడి, బొప్పాయి, నిమ్మ చెట్లు నేలకొరగడం, పండ్లు రాలిపోవడంతో నష్టం సంభవించింది. పొదలకూరు మండలం పీజీ పట్నం, ఇనుకుర్తి, ఆర్‌వై పాళెం గ్రామాల్లో 39 మంది రైతులకు చెందిన 30 హెక్టార్లలో మామిడి, నిమ్మచెట్ల పండ్లు రాలిపోవడం, చెట్లు నేలకొరిగాయి. మనుబోలు మండలం అక్కంపేట, మడమనూరు గ్రామాల్లో ఐదుగురు రైతులకు చెందిన 12హెక్టార్ల లో మామిడి చెట్ల పండ్లు రాలిపోవడంతో నష్టం సంభవించింది. కాగా అకాల వర్షంతో జిల్లాలోని ఉద్యాన రైతులకు సుమారు రూ.15.60 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎంవీ సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఉద్యాన పంటలకు నష్టం జరిగి ఉంటే పరిశీలించి తుది నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వెల్లడించారు.


