కోవూరు: తమిళనాట తలపతి విజయ్ కొత్త అధ్యాయం లిఖించారని, ప్రజల ఆంక్షాలను లోతుగా అర్థం చేసుకుని, వారి విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పాలన అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆకాంక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పరిపాలనతో తమిళనాడు దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యా రంగ బలోపేతం, ఆరోగ్య సేవల మెరుగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామీణాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయ సాధనలో ప్రభుత్వం ముందడుగు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
వడదెబ్బకు
ఇద్దరు రైతుల మృతి
మర్రిపాడు: మండలంలోని సన్నువారిపల్లి గ్రామానికి చెందిన రైతులు గంగిరెడ్డి చెన్నారెడ్డి (55), చాగం రామస్వామి (66) సోమవారం వడదెబ్బకు గురై మృతి చెందారు. ఎండకు పొలం పనులకు వెళ్లిన వారు ఇంటి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారని బంధువులు తెలిపారు. ఒకే రోజు ఇద్దరు రైతులు వడదెబ్బతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రెండో పంటకు
సోమశిల జలాల విడుదల
సోమశిల: జిల్లా జలనిధి సోమశిల జలాశయం నుంచి రెండో పంటకు సాగునీటిని సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరి కేశవచౌదరి సోమవారం విడుదల చేశారు. తొలుత ఇరిగేషన్ అధికారులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్నార్ డెల్టా ఆయకట్టు పరిధిలో 2,02,322, కనుపూరు కాలువ ఆయకట్టు పరిధిలో 27వేలు, కావలి కాలువ ఆయకట్టు పరిధిలో 74,000, దక్షిణ కాలువ ఆయకట్టు పరిధిలో 20వేల ఎకరాలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు 35.98 టీఎంసీల నీటిని అందించనున్నట్లుగా తెలిపారు. కండలేరు కాలువ ఆయకట్టు పరిధిలోని 1,24,000 ఎకరాలకు 13.78 టీఎంసీల నీటిని అందించనున్నట్లుగా వివరించారు. ఉత్తరకాలువ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్న కారణంగా ఈ దఫా నీటిని విడుదల చేయడం లేదని తెలిపారు. ప్రాజెక్ట్ డీఈలు మల్లికార్జున, విజయ్‌బాబు, జేఈఈలు నిఖిల్, శరత్‌చంద్ర పాల్గొన్నారు.
ఏఐఎస్–63కు అనుగుణంగా స్కూల్ బస్సులుండాలి
నెల్లూరు (టౌన్): రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు స్కూల్ బస్సులు ఏఐఎస్–63 నిబంధనలకు అనుగుణంగా ఉండాలని నెల్లూరు ఆర్టీఓ మదాని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను నవీకరించుకోవాలన్నారు. ప్రతి స్కూల్ బస్సును రవాణా అధికారులు తనిఖీ చేసి లోపాలను సూచిస్తారని తెలిపారు. వాటిని సరిచేసుకుని తిరిగి బస్సులను రవాణా అధికారికి చూపించి అనుమతి పొందిన తరువాతే రోడ్డుపై తిప్పాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇన్‌చార్జి డీఎస్‌ఓగా పుల్లయ్య
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(పొగతోట): జిల్లా పౌర సరఫరాల శాఖ ఇన్‌చార్జి అధికారి (డీఎస్‌ఓ)గా పుల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఎస్‌ఓగా పనిచేసిన లీలారాణి బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో కావలిలో ఏఎస్‌ఓగా పనిచేస్తున్న పుల్లయ్యను ఇన్‌చార్జి డీఎస్‌ఓగా నియమించడంతో బాధ్యతలు చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లును డీఎస్‌ఓ మర్యాదపూర్వకంగా కలిశారు.


