కామాక్షితాయి భూమికి ఎసరు | - | Sakshi
Sakshi News home page

కామాక్షితాయి భూమికి ఎసరు

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

బుచ్చిరెడ్డిపాళెం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూబకాసురుల ఆగడాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ జాగా ఎక్కడ కనిపిస్తే అక్కడ పాగా వేస్తున్నారు. చివరకు ఆలయ భూములను సైతం కబ్జా చేసేందుకు వెనకాడడం లేదు. తాజాగా జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయానికి చెందిన సుమారు రూ.6 కోట్లకుపైగా విలువైన భూమిపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. భూమిని ఆక్రమించి లేఅవుట్‌ వేసి సొమ్ము చేసుకునేందుకు రాజకీయ అండతో రంగంలోకి దిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ సదరు భూమి ని కొందరు ఆక్రమించేందుకు యత్నించారు. అయితే గ్రామస్తుల ఫిర్యాదుతో ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. మళ్లీ అదే భూమిపై కన్నేసిన దుండగులు ఆక్రమణకు చదును చేసే పనులు చేపడుతుండడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయ సమీపంలో పెట్రోల్‌ బంకు పక్కన సర్వే నంబరు 129లో సుమారు 90 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి అధికారిక రికార్డుల్లో ఆలయానికి చెందిన పూలతోటగా నమోదై ఉంది. 2024లో ఈ భూమిపై కన్నేసిన కొందరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి లేఅవుట్‌ వేసేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు జోక్యం చేసుకుని ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. విచారణలో భూమి దేవస్థానానికి చెందినదేనని నిర్ధారణ కావడంతో తాజాగా దేవదాయ శాఖ నిషేధిత భూముల జాబితాలో (22ఏ) కూడా చేర్చినట్లు సమాచారం.

బ్రహ్మోత్సవాల వేళ కబ్జాకు యత్నం

ఈ నెల 7వ తేదీ నుంచి కామాక్షితాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఆలయ భూమిని జేసీబీతో చదును చేస్తుండడంపై స్థానిక రాజకీయ నాయకుల అండతో లేఅవుట్‌ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మోత్సవాల హడావుడిని అవకాశంగా తీసుకుని భూమిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆలయ ఈఓ వెంకట శ్రీనివాసులురెడ్డి స్పందిస్తూ సంబంధిత భూమి దేవస్థానానికి చెందినదేనని స్పష్టం చేశారు. భూమిని చదును చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. తహసీల్దార్‌కు సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆలయ భూమి ఆక్రమణకు గురికాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రాజకీయ అండతో మళ్లీ కబ్జాకు యత్నం

బ్రహ్మోత్సవాల హడావుడిలో చదును పనులు

గతంలోనూ అక్రమ రిజిస్ట్రేషన్లు

అప్పట్లో గ్రామస్తుల ఫిర్యాదుతో అడ్డుకట్ట

Advertisement
 
Advertisement
Advertisement