● దెబ్బతిన్న 363 స్తంభాలు, 142 ట్రాన్స్‌ఫార్మర్లు
● ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్‌తో విద్యుత్ సరఫరాకు అంతరాయం
నెల్లూరు సిటీ: జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి కురిసిన ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా నెల్లూరు జిల్లా సర్కిల్ పరిధిలో విద్యుత్ సంస్థకు తీవ్రనష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం విద్యుత్ భవన్‌లోని తన చాంబర్‌లో ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం మీడియా సమావేశం నిర్వహించి నష్టం వివరాలను వెల్లడించారు. జిల్లాలో 11 కేవీలైన్ స్తంభాలు 225, ఎల్టీ స్తంభాలు 138, ట్రాన్స్‌ఫార్మర్లు 142 దెబ్బతిన్నాయని తెలిపారు. 18 కిలోమీటర్ల మేర 11కేవీ, 2 కిలోమీటర్లమేర ఎల్టీ విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని వివరించారు. సుమారు రూ.60 లక్షల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్‌తో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్ జరిగిన ప్రాంతాలను గుర్తించడం కష్టతరం కావడంతో సరఫరా పునరుద్ధరణలో జాప్యం జరిగిందన్నారు. విద్యుత్ సిబ్బంది అర్ధరాత్రి వరకు శ్రమించి లైన్లకు మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమర్ధవంతంగా చర్యలు చేపడుతామన్నారు. విద్యుత్ లైన్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు.


