జిల్లాలో రెండేళ్లుగా నిర్విరామంగా అక్రమ దందా | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో రెండేళ్లుగా నిర్విరామంగా అక్రమ దందా

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

● కావలి నియోజకవర్గంలో కావలి మండలంలో రుద్రకోటలోని ప్రభుత్వ భూముల్లోనే కాకుండా అటవీ ప్రాంతంతోపాటు కొత్తపల్లి, కావలి పెద్ద చెరువు, తాళ్లపాళెం, ఆముదాలదిన్నె, మందాటి చెరువుల నుంచి రెండేళ్లుగా నిర్విరామంగా గ్రావెల్‌ తరలిస్తున్నారు. బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల్లోనూ అత్యంత నాణ్యమైన గ్రావెల్‌ భూములు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు గ్రావెల్‌ తరలిస్తున్నాయి. కావలి పట్టణం చుట్టు పక్కల ఇబ్బడిముబ్బడిగా లేఅవుట్లు వేస్తుండడంతో వాటికి అవసరమైన గ్రావెల్‌ను ఆయా ప్రాంతాల నుంచి అక్రమ రవాణా చేస్తున్నారు. రుద్రకోట వద్ద యథేచ్ఛగా సాగుతున్న గ్రావెల్‌ దందాను కవరేజ్‌ చేసేందుకు వెళ్లి మీడియా ప్రతినిధులను నిర్బంధించి కొట్టి మరీ చేస్తున్నారంటే ఇక్కడ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ● ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం కొండ, తిరుమనతిప్ప కొండలను కొల్లగొడుతున్నారు. సంగంలోని సర్వే నంబరు 252/2లో ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు కేటాయించిన 5.30 ఎకరాల పొలంలో ఈ గ్రావెల్‌ తవ్వకాలు నిరాటంకంగా కొనసాగించారు. మూరకు, బారెడుకు గోతులు పెట్టి భారీ యంత్రాలతో తవ్వి టిప్పర్ల ద్వారా వెంచర్లకు, దూర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. సంగం తిప్ప బీరాపేరు వైపు, కొరిమెర్ల పంపింగ్‌ స్కీమ్‌ సమీపంలోని తిప్పను సైతం నేలమట్టం చేస్తున్నారు. అనంతసాగరం, చేజర్ల మండలాల్లో రెండు నెలల క్రితం వరకు ప్రభుత్వ భూముల్లో గ్రావెల్‌ తవ్వి తరలించి తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకున్నారు. ● ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి, సీతారామపురం, కొండాపురం మండలాల్లో గ్రావెల్‌ దందాకు అడ్డూఅదుపు లేదు. వింజమూరు కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. ఇటీవల కావలి– సీతారామపురం జాతీయ రహదారి విస్తరించడంతోపాటు ఎత్తు పెరగడంతో ఆ స్థాయిలో వెంచర్ల భూములను ఎత్తుకు పెంచేందుకు లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర భూములను తవ్వేసి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వరికుంటపాడు ప్రాంతంలో అయితే ఏకంగా కొండలను, గుట్టలను తవ్వేస్తున్నారు.

జిల్లాలో గ్రావెల్‌ మాఫియా గునపాలతో ప్రకృతి గుండె కోతతో విలపిస్తోంది. కూటమి నేతలు ప్రభుత్వ, అటవీ భూములు, కుంటలు, చెరువుల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. కొండలను, గుట్టలను వదలకుండా నేలమట్టం చేసేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల బినామీల కనుసన్నల్లో ఈ అక్రమ దందా నిర్విరామంగా సాగుతోంది. ఊరూరా భారీ యంత్రాలు పెట్టి.. బావుల్లాంటి గోతులు పెట్టి గ్రావెల్‌ తవ్వి రేయింబవళ్లు విరామం లేకుండా టిప్పర్లతో తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన మైనింగ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలీస్‌, విజిలెన్స్‌ శాఖలు ‘పచ్చ’ నోట్ల మత్తులో జోగుతున్నాయి. ఇష్టారీతిన తవ్వేస్తున్న గుంతల్లోకి నీళ్లు చేరడంతో అభం శుభం తెలియని పిల్లలు అందులో పడి మృత్యువాత పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతున్నా.. అధికార యంత్రాంగానికి కనువిప్పు మాత్రం కలగడం లేదు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతలు ప్రకృతి వనరులు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ, అటవీ భూములు, చెరువులు, కుంటల్లో ఎలాంటి అనుమతులు లేకుండా రేయింబవళ్లు భారీ యంత్రాలతో అక్రమంగా గ్రావెల్‌ తవ్వుకుంటూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లాలో సిటీ నియోజకవర్గం మినహాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో గ్రావెల్‌ భూములు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యేలకు వరప్రసాదినిగా మారింది. పచ్చ నోట్ల మత్తులో పడి ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. అధికార మదంతో తమకెవరి అనుమతులు అవసరం లేదన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తూ.. ప్రభుత్వ ఖజానాకు రాయల్టీ ఎగ్గొట్టి యథేచ్ఛగా గ్రావెల్‌ దందాను కొనసాగిస్తున్నారు.

రూ.100 కోట్లపై మాటే..

జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, గూడూరు, కావలి, సర్వేపల్లి తదితర నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బినామీలను పెట్టుకుని వారి కనుసన్నల్లో గ్రావెల్‌ దందా కొసాగిస్తున్నారు. రెండేళ్లుగా ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.100 కోట్ల మేర గ్రావెల్‌ సంపదను దోచుకున్నట్లు తెలుస్తోంది. భారీ యంత్రాలతో నిబంధనలు పాటించకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. గ్రావెల్‌ దందాలో సర్వేపల్లి మొదటి స్థానంలో ఉంటే.. కావలి, ఆత్మకూరు, ఉదయగిరి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయనే ఆరోపణలకు ఆయా ప్రాంతాల్లో తవ్వేసిన గ్రావెల్‌ గుంతలు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఎక్కడ ఎంతెంత..

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో రామదాసుకండ్రిగలో సుమారు 35 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. సర్వేపల్లి పంచాయతీ పరిధిలో 100 ఎకరాలకు పైగా భూముల్లో కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్‌ను ఇప్పటి వరకు తరలించారు. ఇక కందలపాడులోని సర్వే నంబరు 57లో 174.67 ఎకరాల కొండపోరంబోకు (కందలపాడు తిప్ప) భూముల్లో సుమారు 45 ఎకరాల్లో అక్రమ గ్రావెల్‌ తరలించినట్లు అంచనాలు ఉన్నాయి. ఒక్క వెంకటాచలం మండలంలోనే లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను తరలించడం గమనార్హం. ఇక పొదలకూరుకు సమీపంలో చిట్టేపల్లి తిప్ప సర్వే నంబర్‌ 707లో గ్రావెల్‌ ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. కొండ సైతం కరిగిపోతోంది. మరుపూరుకు సమీపంలోని ఎస్టీల అనుభవంలో ఉన్న సుమారు 70 ఎకరాల్లో నుంచి గ్రావెల్‌ అక్రమంగా తరలించారు.ఇందుకోసం రాచబాటలను కూడా నిర్మించారు.

కందలపాడులో కుంటను తలపించేలా గ్రావెల్‌ తవ్వకాలు

అనుమతుల్లేవు.. నిబంధనలు పాటించరు

ప్రభుత్వ భూములు, కుంటలు,

చెరువుల్లో యథేచ్ఛగా తవ్వకాలు

కొండలు, గుట్టలనూ వదలని వైనం

ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.100 కోట్లకు పైనే దోచుకున్న కూటమి నేతలు

గుంతల్లో పడి అభంశుభం తెలియని పిల్లలు మృత్యువాత

2014–19 మధ్య వెంకటాచలంలో 9 మంది పిల్లలు..

తాజాగా సైదాపురం వద్ద ఇద్దరు బిడ్డలు..

చోద్యం చూస్తున్న

అధికార యంత్రాంగం

ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు

జిల్లాలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో ఉన్న నీటిలో పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. 2014–19 మధ్య కాలంలో వెంకటాచలం మండలంలో టీడీపీ నేతలు తవ్విని అక్రమ గ్రావెల్‌ గుంతల్లో పడి 9 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. రెండేళ్లల్లో ఐదారు మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. తాజాగా సైదాపురం వద్ద ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, అటవీశాఖ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు జరుగుతున్నా ఆయా శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కళ్ల ముందు అవినీతి జరుగుతున్నా మైనింగ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలీస్‌, విజిలెన్స్‌ చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీ నేతలకు జీ హుజూర్‌ అంటున్నారు. కనీసం జిల్లా పాలనాధికారి కూడా స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారుల స్పందించి అక్రమార్కులపై కొరడా ఝళిపించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement